Sunday, 20 March 2011

కుండీలు సిద్ధం చేస్తున్నారా


కుండీ అడుగున కుండ పెంకులు.. ఎండు ఆకులు.. ఇసుక వేసిన తర్వాత మట్టి మిశ్రమం పోయాలి
నీరు నిలవ లేకుండా చూసుకోవాలి
కంపోస్టు, తదితరాల కన్నా
మట్టి తక్కువ వాడితేనే అధిక దిగుబడి

మూడు వారాల నుంచి మనం ‘ఇంటి పంట’లో అనేక విషయాలు మాట్లాడుకున్నాం గదా.. ఇంటిపట్టున కూరగాయలు, ఆకుకూరలు పెంచుకోవడానికి సిద్ధమవుతున్నారా? మేడ మీదో, పెరట్లోనో కుండీలు ఏర్పాటుచేసుకోవడానికి అవసరమైనవన్నీ సమకూర్చుకుంటున్నారా? మరికొన్ని జాగ్రత్తల గురించి తెలుసుకుందామా మరి.. కుండీలు ఏర్పాటు చేసుకునేటప్పుడు కొన్ని మెలకువలు పాటిస్తే మొక్కల పోషణలో సమస్యలు ఎదురవకుండా చూసుకోవచ్చు.

మట్టి మిశ్రమం ఇలా..
కుండీల్లో కూరగాయలు, ఆకుకూరలు పెంచుకోవడానికి సిద్ధం చేసుకునే మట్టి మిశ్రమం ఎలా ఉండాలి? కచ్చితంగా ఇలాగే ఉండాలన్న నియమం ఏమీ లేదు. కానీ, ఎర్ర మట్టి వాడితే గట్టిపడిపోకుండా ఉంటుంది. నల్లమట్టి వాడాల్సి వస్తే.. గట్టిపడే స్వభావం నల్లమట్టికి ఎక్కువ కాబట్టి మట్టి పాళ్లను తగ్గించాలి. ఇసుకను కూడా కొంత మేరకు వాడాలి. ఇక కంపోస్టు.. ఆకు ఎరువు (లీఫీ మౌల్డ్), వర్మీ కంపోస్టులలో దేన్నయినా వాడొచ్చు.
ఆకులు అలములపై పశువుల పేడ నీటిని చల్లి ఆకు ఎరువును తయారుచేస్తున్నారు. కొన్ని మార్పులతో పాటు వానపాములు వాడి వర్మీ కంపోస్టు తయారుచేస్తున్నారు. మడుల ఏర్పాటుకు ఈ రెంటినీ వివిధ పాళ్లలో వాడుతున్న వాళ్లున్నారు. ఆకు ఎరువును అధిక పాళ్లలో వాడుతున్న వాళ్లున్నారు. పూర్తిగా ఆకు ఎరువునే వాడుతూ మామూలుకన్నా మూడు రెట్లు ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు పెంచుతున్న వాళ్లూ ఉన్నారు.
గింజల పిండి..

వేప, కానుగ, శీతాఫల, ఆముదం గింజల పిండిని తగుమాత్రంగా మట్టి మిశ్రమంలో కలపడం ద్వారా చీడపీడలను నివారించవచ్చు. అదనపు పోషకాలు కూడా మొక్కలకు అందుతాయి. కొబ్బరి పొట్టు లేదా రంపపు పొట్టును కూడా కలుపుతున్నారు. మట్టిని వదులుగా ఉంచి మొక్కలు కుచ్చులు కుచ్చులుగా వేళ్లుపోసుకోవడానికి ఇవి దోహదపడతాయి. కొబ్బరి పొట్టు మట్టికన్నా 8 రెట్లు అధికంగా నీటిని పట్టి ఉంచుతుంది. వర్మిక్యులైట్‌ను కూడా కలుపుతున్నారు. ఇది మైకా గనుల వద్ద లభించే వ్యర్థ పదార్థం. ఇది తేమ ఆరిపోకుండా చూస్తుంది. కాబట్టి వేసవి కాలంలో వీటి అవసరం ఎక్కువ. నీటి వృథా బాగా తగ్గుతుంది.

ఎరమ్రట్టి 1పాళ్లు, ఆకు ఎరువు 4, వర్మీ కంపోస్టు 2, వర్మిక్యులైట్ 1, కొబ్బరి పొట్టు 1 పాళ్లలో వాడి మట్టి మిశ్రమాన్ని తయారుచేసుకోవచ్చు. తక్కువ స్థలంలో పెంచుకుంటున్నాం కాబట్టి.. మట్టి పాళ్లు తక్కువగావాడి.. ఇతర పదార్థాలను అధిక పాళ్లలో వాడడం మంచిది. వర్మిక్యులేట్ అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. కొబ్బరి పొట్టు అందుబాటులో ఉంటుంది. లేదంటే.. రంపపు పొట్టయినా దొరుకుతుంది. మూడింటిలో ఏదో ఒకటైనా ఉండేలా చూసుకుంటే మంచిది. ఇవి దొరకని పరిస్థితుల్లో సగానికి పైగా ఎరమ్రట్టి కలుపుకోవచ్చు.

నీరు నిల్వ ఉంటే మొక్కలకు హాని
కుండీల్లో గాని, మడుల్లో గాని మొక్కలు సక్రమంగా పెరగడానికి తగుమాత్రంగానే నీరు పోయాలి. వాతావరణంలో వేడిని బట్టి ఎంత అవసరమో చూసుకొని ఏర్పాట్లు చేసుకోవాలి. కుండీలో మట్టి ఎప్పుడూ తగుమాత్రంగా తడిగా ఉండేలా చూసుకోవాలి. నీరు నిల్వ ఉండిపోకూడదు. అలాగని మట్టి తడి ఆరిపోకూడదు. ఎప్పుడూ తడీ పొడిగా ఉండాలన్న మాట. ఎక్కువైన నీరు కిందికి ఎప్పటిదప్పుడు దిగిపోయేలా జాగ్రత్త తీసుకోవాలి.

కుండీల బెజ్జాలు పూడిపోకుండా...
కుండీలకు అడుగు భాగాన విధిగా బెజ్జాలు ఉండేలా చూసుకోవాలి. రెండు మూడు బెజ్జాలు ఉండాలి. అంతేకాదు. అవి పూడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకోసం.. కొన్ని పెంకు ముక్కలు లేదా కొబ్బరి చిప్ప ముక్కలు, చిన్న చిన్న రాళ్లు వంటి గట్టిగా ఉండేవాటిని ఎగుడు దిగుడుగా వేసి మధ్యలో ఖాళీలు ఉండేలా చూడాలి. వాటిపైన అంగుళం మందాన ఎండు ఆకులు పరవాలి. ఆపైన అంగుళం మందాన ఇసుక పోయాలి.

తర్వాత మట్టి, కంపోస్టు తదితరాల మిశ్రమాన్ని పోస్తే కుండీ సిద్ధమైనట్టే. అల్యూమినియం టబ్‌లలో ఆకుకూరలు, కూరగాయలు పెంచుతున్న వారు అడుగున అంగుళం మందాన కొబ్బరి పీచును వాడుతున్నారు. నీరు పోవడానికి అనువుగా ఉండడమే కాకుండా మొక్కల వేళ్లకు వేడి తగలకుండా చూడడానికి కొబ్బరి పీచు ఉపయోగపడుతోంది. తర్వాత కాలంలో కూడా.. ఎక్కువైన నీరు దిగిపోతున్నదీ లేనిదీ గమనిస్తుండాలి. నీరు పోతున్నట్టు లేకపోతే.. కుండీపై నుంచి పుల్లను బెజ్జంలోకి గుచ్చి.. ఎక్కువైన నీరు బయటకు పోవడానికి దారి ఏర్పాటుచేయాలి.

- ‘సాక్షి’ స్పెషల్ 

No comments:

Post a Comment