Monday, 21 March 2011

సేంద్రియం వైపు.. జనం చూపు



రసాయనిక పురుగుమందుల అవశేషాలతో ఆహారం కలుషితమై ఆరోగ్యాన్ని హరిస్తున్న నేపథ్యంలో.. ఈ విషయాలు కాస్త తెలిసిన వారు పురుగుమందులు, రసాయనిక ఎరువులు వాడకుండా పెంచిన సేంద్రియ ఆహారోత్పత్తుల వైపు మళ్లుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సైతం సేంద్రియ ఆహారోత్పత్తుల వినియోగం ఏటా 20-25 శాతం మేరకు పెరుగుతోంది. మన దేశంలో కూడా నగరాలు, పట్టణ ప్రాంతాల్లో సేంద్రియ ఆహారోత్పత్తుల వాడకం అంతకంతకూ పెరుగుతోంది. స్పెన్సర్స్ లాంటి పలు సూపర్ మార్కెట్లలో సేంద్రియ కూరగాయల కొనగోళ్లు ఇటీవల పెరుగుతున్నాయి. వీటి ధర మామూలు వాటికన్నా ఎక్కువే అయినా.. తర్వాత వచ్చే పరిణామాలకు రోగాలకు తగలేసేదానికన్నా తక్కువే కదా అని వీరి అభిప్రాయం.
ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఆరోగ్యదాయకమైన ఆహారం, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య రహిత పరిసరాలపై చైతన్యం క్రమంగా పెరుగుతోంది. ఈ చైతన్యమే సేంద్రియ సేద్యంపై మక్కువ పెంచుతోంది. తాము పండించుకున్న ఆహారాన్నే తినాలన్న భావన, గ్రామీణాభివృద్ధి, ప్రకృతి పరిరక్షణ భావన సేంద్రియ సేద్యం విస్తరించడానికి దోహద పడుతోంది. సహజ సేద్యం భారతీయులకు అనాదిగా అలవాటైనదే. అయితే, వలస పాలనలో దేశీయ సాగు పద్ధతులు ధ్వంసమై వ్యవసాయ రంగం అస్తవ్యస్తమైంది. ఆ నేపధ్యంలో 1960వ దశకంలో రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం ఉధృతంగా ప్రారంభమైన తర్వాత దిగుబడి పెరిగినా... క్రమంగా సమస్యలు ముప్పిరిగొని సంక్షోభానికి దారితీశాయి. రసాయనిక సేద్యం వల్ల వ్యవసాయోత్పత్తుల్లో పోషకాలు లోపించడం, రుచి తగ్గడం, పర్యావరణంపై ముఖ్యంగా నేలకు, పర్యావరణానికి తీరని హాని వాటిల్లుతుండడం వ్యవసాయ రంగంలో పెను సంక్షోభాలకు దారితీసింది.

ఈ విపరిణామాల నేపథ్యంలో ఇటీవలి సంవత్సరాల్లో మన దేశంలో కూడా సేంద్రియ సేద్యంపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించడం ప్రారంభించాయి. ఉత్తరాంచల్, సిక్కిం, మేఘాలయ వంటి ఈశాన్య రాష్ట్రాలు సేంద్రియ సేద్యాన్ని పూర్తిస్థాయిలో అందిపుచ్చుకున్నాయి. కర్నాటక, తమిళనాడు, కేరళ, బీహార్ సహా 11 రాష్ట్రాలు సేంద్రియ సేద్యం ప్రాధాన్యం గుర్తెరిగి స్పష్టమైన విధానాలను ప్రకటించాయి. రసాయనిక పురుగు మందులు, ఎరువులు వాడే అలవాటు తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో సేంద్రియ సేద్యాన్ని పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తున్నాయి. మన రాష్ట్రం సేంద్రియ సాగు విధానం ముసాయిదా మాత్రం ప్రకటించింది.

సేంద్రియ కూరగాయలు, పండ్ల వల్ల ఉపయోగాలు..

సూపర్ మార్కెట్లో రకరకాల ఉత్పత్తులు కనిపిస్తాయి.. ‘పిల్లలకు ప్రోటీన్లు, విటమిన్లు అందిస్తాయి, మా ఉత్పత్తుల్లో ఐరన్ పుష్కలంగా ఉంది.. మీ పిల్లలు బాగా పెరుగుతారని...’ ప్రకటనలు చూసి వందలు పోసి కొంటాం. కానీ, సేంద్రియ పద్ధతుల్లో పెంచిన కూరగాయలు, పండ్లలోనే ఇవి పుష్కలంగా ఉంటాయి. రసాయనిక ఎరువులు, పురుగుమందులతో పెంచిన ఉత్పత్తుల్లో 87 శాతం పోషకాలే ఉంటాయని ఒక అంచనా. సేంద్రియ పద్ధతుల్లో పెంచిన ఉత్పత్తుల్లో పోషకాలు పుష్కలం. రసాయనిక ఎరువులతో పెరిగిన కూరగాయలతో పోలిస్తే సేంద్రియ కూరగాయల్లో విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి. ఇక రుచి సంగతి చెప్పన క్కర్లేదు. రసాయనాల అవశేషాలు ఉండవు కనుక రోగాలు అంటవు.

ఎందుకు ఇవి ఎక్కువగా దొరకవు?

ప్రభుత్వం రసాయనిక ఎరువులు, పురుగుమందులతో చేసే సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నంతగా సేంద్రియ సేద్యాన్ని ప్రోత్సహించడం లేదు. ప్రభుత్వ ప్రాధాన్య రంగాల్లో సేంద్రియ సేద్యం లేదు! ఎకరానికి సరిపోయే రసాయనిక ఎరువులపై యూరియా, డీఏపీలపై ప్రభుత్వం కనీసం రూ.3 వేల సబ్సిడీ ఇస్తుంది. కానీ కంపోస్టుతో సేంద్రియ సేద్యం చేసే రైతుకు నేరుగా ఇస్తున్నదేమీ లేదు. సేంద్రియ సాగులో వ్యక్తిగత శ్రద్ధ మరింత అవసరం. రైతుకు శ్రమ కొంచెం ఎక్కువే. అయినా సేంద్రియ సేద్యంతో ఆరోగ్యదాయకమైన సహజాహారం పండించేందుకు కొందరు రైతులు కృషి చేస్తున్నారు. నిజానికి ఇక్కడే ఎగుమతుల మార్కెట్ మనకు లాభిస్తోంది.. అమెరికా, యూరప్ లాంటి దేశాల్లో లేబర్ కాస్ట్ ఎక్కువ కనుక సేంద్రియ ఉత్పత్తుల కోసం వారు భారత్ వంటి దేశాలపై ఆధారపడుతున్నారు. పంట పండించాక నిల్వ ఉంచడానికి రసాయనాలు వాడకుండా ఉండాలంటే ప్రాసెసింగ్, రవాణా సదుపాయాలు మెరుగ్గా ఉండాలి. మార్కెట్‌కు వెంటనే చేరేసే వ్యవస్థ ఉండాలి. సేంద్రియ సాగులో తొలినాళ్లలో దిగుబడి కొంతమేరకు తక్కువగా ఉంటుంది కనుక రైతుకు వాణిజ్య పరంగా గిట్టుబాటు కావాలంటే.. ప్రభుత్వం ఇటువంటి రైతులకు వెన్నుదన్నుగా నిలవాలి. రసాయనిక ఎరువులపై రాయితీ ఇస్తున్న ప్రభుత్వం.. సేంద్రియ ఎరువులు, సహజ ఔషధాల తయారీ, కొనుగోలుకు నేరుగా ప్రోత్సాహకాలను అందజేస్తే మేలు జరుగుతుంది.

మరి ఇంతేనా..

దేశవ్యాప్తంగా సేంద్రియ పంటల సాగు పెరుగుతోంది. ప్రధాన కారణం... ఎగుమతులు పెరగడం. అమెరికా, జపాన్, యూరప్ దేశాల్లో సేంద్రియ ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోంది. దీనితో పాటు ఎగుమతులపై దృష్టి పెట్టిన హైదరాబాద్‌లోని ‘శ్రేష్ట’ వంటి కొన్ని ప్రైవేటు సంస్థలు రైతులను ప్రోత్సహించి.. వారికి సదుపాయాలు కల్పించి సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయిస్తున్నాయి. వీటి ఎగుమతుల మార్కెట్ ఏటా 13 శాతం పెరుగు తోంది. ప్రస్తుతం 50 బిలియన్ డాలర్లున్న ఈ మార్కెట్ 2014 కల్లా 96.5 బిలియన్ డాలర్లు దాటుతుందని అంచనా. దీనిలో అమెరికా వాటా 49 శాతం. ప్రాసెస్డ్ ఫుడ్ మినహాయిస్తే... కూరగాయలు, పండ్లదే 36 శాతం ఉంటుంది. అంటే మనకు కావల్సినంత గిరాకీ.

సేంద్రియ రైతుకు రాబడి ఎక్కువ

ఇక్కడో ఆకర్షణీయమైన అంశం ఏమిటంటే... రసాయనిక ఎరువులతో పండిన పంట దిగుబడులపై కన్నా సేంద్రియ ఆహారోత్పత్తులపై రైతులకు 30-40 శాతం ఎక్కువ రేటు వస్తుంది. మన దేశంలో కూడా (ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో) ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం, రసాయనాల అవశేషాల వల్ల ఆరోగ్యపరంగా కలిగే హాని గురించి అవగాహన పెరుగు తుండడంతో సేంద్రియ ఆహారోత్పత్తుల వాడకం ఊపందుకుంది, హైదరా బాద్ లాంటి నగరాల్లో వీటి వాడకం గణనీయంగా పెరిగింది. విడి గా సేంద్రియ మార్కెట్‌లు ఉండడమే కాదు.. కొన్ని రైతు బజార్లలో దాదాపు అన్ని పెద్ద సూపర్ మార్కెట్లలో ఈ కూరగాయలు దొరుకుతున్నాయి.

సేంద్రియ ఆహారంపై పెరుగుతున్న చైతన్యం

సేంద్రియ సాగు ద్వారా ఉత్పత్తయ్యే సహజాహారం చేసే మేలు గురించి అనేక స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో చైతన్యం తేవడానికి కృషిచేస్తున్నాయి. హైదరాబాద్ వంటి నగరాలలో ఇటువంటి ప్రకృతి ఆహారం స్టాళ్లు పెరుగు తున్నాయి. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఒకే చోట నాలుగు స్టాళ్లు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కొనుగోళ్లు పెరుగుతున్నాయని ఒక స్టాల్ యజమాని రంగారావు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. గోధుమ గడ్డి, ముడి బియ్యం, కొరల్రు, జొన్న రవ్వ, రాగి పిండి అమ్మకాలు పెరిగినట్లు ఆయన వివరించారు. ఈ షాపుల్లో అన్ని రకాల తృణధాన్యాలు లభిస్తున్నాయి. సుస్థిర వ్యవసాయ కేంద్రం(సీఎస్‌ఏ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని తార్నాకలో ‘సహజాహారం’ పేరిట సేంద్రియ ఆహారోత్పత్తులు విక్రయిం చే స్టాల్ ఏర్పాటైంది. బియ్యం, పప్పుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు విక్రయిస్తున్నారు. డోర్ డెలివరీ సదుపాయం కూడా కల్పించారు. సేంద్రి య కూరగాయలను హైదరాబాద్‌లోని రెండు ప్రాంతాల్లో వ్యాన్‌లో తీసుకెళ్లి బుధ, శనివారాల్లో విక్రయిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాలకు దశలవారీగా విస్తరించనున్నారు. తృణధాన్యాల సాగును మెదక్ తదితర జిల్లాల్లో ప్రోత్సహిస్తున్న దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో సేంద్రియ తృణధాన్యాలను అందు బాటులోకి తెస్తోంది.

బియ్యం, గోధుమల్లోకన్నా కనీసం పది శాతం అధిక పోషకాలు తృణధాన్యాల్లో ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. పూర్తిగా తృణ ధాన్యాలనే ఆహారంగా తీసుకుంటే సుగర్ వంటి వ్యాధులు బాధించని స్థాయికి తగ్గిపోయాయని కొందరు వైద్యులు చెప్తున్నారు. హైదరాబాద్ లోని సచివాలయం వద్ద మాజీ మంత్రి ముత్యంరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్‌లో సేంద్రియ బియ్యం, కూరగాయలను అనుదినం సాయంత్రపు వేళల్లో విక్రయిస్తున్నారు. ఈ స్టాల్‌కు అమిత ప్రజాదరణ లభిస్తున్నది. ఇక కేంద్ర ప్రభుత్వం పదో పంచవర్ష ప్రణాళికలో దీని కోసం వంద కోట్లు కేటాయించింది. పదకొండవ పంచవర్ష ప్రణాళికలో ఇంకా బాగా దృష్టి పెడతామంటోంది.
పంతంగి రాంబాబు, ‘సాక్షి’ స్పెషల్ డెస్క్


సేంద్రియ సాగుపై ఏదీ పరిశోధన?

వ్యవసాయ పరిశోధనలకు ప్రభుత్వం ఏటా వేల కోట్లు ఖర్చు చేస్తూ సేంద్రియ సేద్యాన్ని పట్టించుకోకపోవడం సరికాదు. మా వంటి రైతులు సేంద్రియ సాగులో ఎంత అధిక దిగుబడులు సాధించి ఎన్ని అవార్డులు సంపాయించినా.. ఎంత చేసినా మాకు లాబ్ లేదు కాబట్టి నాన్ టెక్నికలే..! ప్రపంచం అంతా గుర్తిస్తున్న సేంద్రియ సేద్యంపై ఇప్పటికీ పరిశోధనా కేంద్రం ఒక్కటీ లేదంటే ప్రభుత్వ ప్రోత్సాహం ఏ మేర ఉందో అర్థం చేసుకోవచ్చు. సేంద్రియ రైతులకూ ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలి. పరిశోధన జరిగి ఉంటే ‘సెర్ప్’ ఆధ్వర్యంలో జరుగుతున్న సేంద్రియ సాగు మరింత నిర్మాణాత్మకంగా, ఆచరణాత్మకంగా ఉండడానికి వీలయ్యేది.
గుడివాడ నాగరత్నం నాయుడు,
సేంద్రియ రైతు, తారామతిపేట, రంగారెడ్డి జిల్లా

సేంద్రియ సాగు విధానం ప్రకటించాలి

రాష్ట్ర ప్రభుత్వం 2008లో సేంద్రియ వ్యవ సాయ విధానంపై ముసాయిదా పత్రాన్ని వెలు వరించింది. అయితే దానిపై ఇంత వరకు చర్చ లేదు. సేంద్రియ సేద్యం చేస్తున్న రైతులు బయట కొనే ముడిసరుకులకే కాకుండా తాము స్వయంగా తయారుచేసుకున్న సేంద్రియ ఎరువులు, ఔషధా లకు కూడా సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించాలి. సహజ ఆహారంపై ప్రజల్లో చైతన్యం పెరుగు తోంది. రైతు సహకార సంఘాల తరఫున హైదరాబాద్‌లోని తార్నాకలో ఏర్పాటు చేసిన ‘సహజాహారం’ స్టాల్‌కు మంచి స్పందన లభిస్తోంది. రాష్ర్టవ్యాప్తంగా సేంద్రియ రైతు సహకార సంఘాలు ఉన్నాయి. తమ సంస్థ ఆధ్వర్యంలో విశాఖ, కరీంనగర్, నల్లగొండ, కర్నూలు, అనంతపురం, వరంగల్ జిల్లాలలోని 130 గ్రామాలలో సేంద్రియ పద్ధతుల్లో సాగు జరుగుతుంది.
డాక్టర్ జీవీ రామాంజనేయులు, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్
సుస్థిర వ్యవసాయ కేంద్రం(సీఎస్‌ఏ) హైదరాబాద్

దిగుబడి తగ్గినా ఆదాయం తగ్గదు!

సేంద్రియ సాగు ప్రారంభించే రైతులకు నేల సారం మెరు గయ్యే వరకూ ఒకటి రెండేళ్లపాటు రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడినప్పుడు వచ్చిన దిగుబడిలో 60 శాతం వస్తుంది. 3, 4 ఏళ్ల తర్వాత 90 నుంచి 95 శాతం దిగుబడి వస్తుంది. సేంద్రియ దిగుబడులకు అధిక ధర వస్తుంది కాబట్టి, రైతుకు లాభం ఇంచు మించు అదేస్థాయిలో నికరాదాయం వస్తుంది. కనీసం పిల్లలకైనా సేంద్రియ ఆహారం అందిస్తే రాబోయే తరం బాగుంటుంది. రైతులందర్నీ సేంద్రియ సేద్యం చేయమంటే ఆహార లభ్యత తగ్గి పోయే ప్రమాదముంది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో సేంద్రియ సాగును ప్రభుత్వం ప్రోత్సహించాలి.
డాక్టర్ బాబూ రతన్, సీనియర్ శాస్తవ్రేత్త , ఉద్యాన కళాశాల పరిశోధనా కేంద్రం, అనంతరాజు పేట, వైఎస్సార్ జిల్లా


‘ఇంటి పంట’ వ్యాప్తికి ‘సాక్షి’ యజ్ఞం

కూరగాయలు, ఆకుకూరల్లోకి విషం ఎట్లా చేరుతున్నదో తెలుసుకున్నాం కదా.. రసాయనాల బెడద తప్పించుకోవాలం టే సేంద్రియ సాగు పద్ధతులే దిక్కు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆశించి లాభం లేదు. పల్లెల్లో ఉండేవాళ్లే కాదు.. పట్నాల్లో.. నగరాల్లో కాపురం ఉంటున్న వాళ్లూ... ఎవరి ఇంటి దగ్గర వాళ్లు ఆరోగ్యదాయకంగా కూరగాయలు, ఆకుకూరలు పండించుకో వచ్చు. ఇదంతా కష్టం అనుకునేరు సుమా..! ఆరోగ్యమే మహా భాగ్యం కదా...! చాలా సులువుగా, శ్రమ లేకుండా మీ ఇంటి దగ్గర ఉన్న జాగాలోనే వీలైనన్ని మొక్కలు వేయండి. ఇంటి ముందో వెనకో ఖాళీ జాగా ఉంటే సరేసరి.

అంతగా స్థలం లేక పోయినా.. మేడ మీదైనా కూరగాయలు, ఆకుకూరలు ఎంచక్కా ఏడాది పొడవునా పెంచుకునే భేషైన మార్గాలున్నాయి. ఈ మహా ఆరోగ్య రక్షణ యజ్ఞంలో ‘సాక్షి’ మీకు తోడుంటుంది. నిపుణుల సలహాలు అడుగుదాం. ఇప్పటికే ఈ యజ్ఞం చేస్తున్న అదృష్టవం తుల్ని అడిగి వారి అనుభవాలు తెలుసుకుందాం. అనుభవాలు పంచుకుందాం. ఈ సదాశయంతోనే ‘ఇంటి పంట’ శీర్షికను మీ కోసం ‘సాక్షి’ ప్రారంభిస్తోంది. ప్రతి శుక్ర, శనివారాల్లో మీ నియోజకవర్గ పులవుట్ 3వ పేజీలో.. ‘ఇంటి పంట’ మిమ్మల్ని పలకరిస్తూ ఉంటుంది. కిచెన్ గార్డెన్ పెంచుకోవడానికి మరి మీరూ సిద్ధమవుతున్నారు కదూ...!
 ‘సాక్షి’ స్పెషల్ డెస్క్

No comments:

Post a Comment