![]() కంపోస్టు అంటే.. మొక్కలు చక్కగా పెరగడానికి అవసరమైన అన్ని పోషకాలూ కలిగిన మట్టిలాంటి సేంద్రియ పదార్థం. మీ అంతట మీరు పెరట్లో కొన్ని రకాల ఎండిన/పచ్చి ఆకులు అలములు, పేడ నీళ్లు కలిపి.. అప్పుడప్పుడూ తిరగేస్తూ తయారుచేసుకునే కంపోస్టే (లీఫీ మౌల్డ్ లేదా ఆకు ఎరువు) అత్యుత్తమమైనది. కంపోస్టు మూడు రకాలు... {పాణవాయువు సోకే పద్ధతిలో తయారుచేసిన (ఏరోబిక్) కంపోస్టు. గాలి సోకకుండా తయారైన (ఎనరోబిక్) కంపోస్టు. వర్మీ కంపోస్టు (వానపాములతో తయారుచేసేది). ఏరోబిక్ పద్ధతిలో తయారైన ఆకు ఎరువు నాణ్యంగా ఉంటుంది. బరువు తక్కువ కాబట్టి.. మేడపై మడుల్లో, కుండీల్లో కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవడానికి ఆకు ఎరువు అనువుగా ఉంటుంది. ఏరోబిక్ కంపోస్టును పెరట్లో దిబ్బ వేసి తయారుచేసుకోవచ్చు. ఆకు ఎరువు తయారుచేయడం ఇలా.. నేలపైనే చెట్టు నీడన ఎరువు దిబ్బను ఏర్పాటుచేసుకోవచ్చు. దిబ్బ మరీ ఎక్కువ ఎత్తు ఉంటే బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి గాలి ఎక్కువగా చొరబడదు. ఎరువు దిబ్బ 4 అడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పు, 4 అడుగుల పొడవున ఉంటే సదుపాయంగా ఉంటుంది. కావాల్సినవన్నీ సేకరించుకొని ఒకే రోజు దిబ్బ వేయాలి. దిబ్బ వేసే చోట పలుగు/గడ్డిపారతో చిన్న గుంత తవ్వాలి. 2-3 అంగుళాల మందం ఉండి ఆరు అడుగుల పొడవు ఉండే కట్టెను గుంతలో గుచ్చాలి. ఇప్పుడు దిబ్బను కట్టె చుట్టూ ఏర్పాటుచేయాలి. దిబ్బలో గాలి బాగా ప్రసరించడానికి ఇది పొగగొట్టం మాదిరిగా పనిచేస్తుంది. అడుగున 2 అంగుళాల మందంలో చిన్న పుల్లలు వేయాలి. దిబ్బ అడుగున నీరు నిలబడకుండా ఉండేందుకు ఇలా చేయాలి. కూరగాయలు, ఆకుకూరల వ్యర్థాలు, 5, 6 రకాల పచ్చని ఆకులు.. ఎండు ఆకులు(వీటిని రెండు రోజులు ముందునుంచే తడిపి ఉంచుకొని దిబ్బలో వేయాలి).. ఆవు పేడ కలిపిన కళ్లాపి వాడాలి. ఇవి నత్రజనిని అందిస్తాయి. మొక్కల వ్యర్థపదార్థాలను (పచ్చివి, ఎండువీ) సేకరించి వాటిని 1-2 అంగుళాల ముక్కలుగా కత్తిరించాలి. గట్టిగా ఉండే పెద్ద కొమ్మలు వాడకుండా ఉంటే మంచిది. రంపపు పొట్టు, కొబ్బరిపొట్టు కొంత కలిపితే కర్బనంను అందిస్తాయి. రాతిపొడి, కరల్రను కాల్చిన బూడిద, కోడిగుడ్ల పెంకుల పొడి, ఎముకల పొడి.. వంటి ధాతువులు కొద్ది మోతాదులో కలుపుకోవచ్చు. వీటిని పొరలు పొరలుగా పేర్చితే దిబ్బ తయారవుతుంది. ప్రతి పొరపైనా ఆవు పేడతో తయారుచేసిన కళ్లాపిని చల్లి.. ఆపైన మరో పొర వేసుకోవాలి. కంపోస్టుకు దోహదపడే సూక్ష్మజీవులు పాడి ఆవు పేడలో ఎక్కువగా ఉంటాయి. ఎరువు దిబ్బ మధ్యలో 60 డిగ్రీల వేడి పుడుతుంది. కంపోస్టు తయారీ ప్రక్రియ పుంజుకున్నదనడానికి ఇది సూచిక. త్వరగా మంచి కంపోస్టు తయారవ్వాలంటే దిబ్బలో తగిన తేమ ఉండేలా చూసుకుంటూ.. రెండు మూడు రోజులకోసారి తిరగేస్తూ.. లోపలి పదార్థాలను బయటకు, బయటి పదార్థాలను లోపలికి వెళ్లేలా చూడాలి. దిబ్బ తడీపొడిగా ఉండేలా నీరు తగుమాత్రంగా చిలకరించాలి. ఎక్కువ ఆక్సిజన్‌ను దిబ్బలోని పదార్థాలకు, సూక్ష్మజీవులకు అందించడం కోసం ఇలా చేయాలి. ఎంత ఎక్కువ ఆక్సిజన్ దిబ్బలోకి వెళితే.. అంత త్వరగా బాక్టీరియా వృద్ధిచెంది.. అంత త్వరగా కంపోస్టు సిద్ధమవుతుంది. వంటింటి వ్యర్థాలతో నగరాల్లో, గ్రామాల్లోనూ.. ఇంటి వద్ద కూడా కంపోస్టును సులభంగా తయారు చేసుకోవచ్చు (ఇదెలాగో వచ్చే వారం తెలుసుకుందాం). - ‘సాక్షి’ స్పెషల్ డస్క్ ఇలా చేయండి... మొక్కల వ్యర్థాలు (పచ్చివి, ఎండువీ) 1, 2 అంగుళాల ముక్కలు చేసి మాత్రమే వాడాలి. సింథటిక్ పదార్థాలు అసలు వాడకూడదు. దిబ్బ 4 అడుగుల ఎత్తు, 4 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు ఉంటే మంచిది. అంతకన్నా తక్కువ ఉన్నా, అంతకన్నా ఎక్కువ ఉన్నా ఇబ్బందే. దిబ్బ ఎప్పుడూ తడీ పొడిగా ఉండాలి. బొత్తిగా ఎండి పోకూడదు. అలాగని.. తడిగా నీరుకారకూడదు. రైతు బజారు వ్యర్థాలతో.. రైతు బజారులో దెబ్బతిన్న, మిగిలిపోయిన కూరగాయలు ఒకటి రెండు బస్తాలు తెచ్చుకొని.. చిన్న చిన్న ముక్కలు చేసి కంపోస్టు చేసుకునే వీలుందని విజయవాడకు చెందిన చలసాని దత్తు (94414 73246) సూచిస్తున్నారు. బేకరీ నుంచి సేకరించిన కోడిగుడ్డు పెంకుల పొడిని వినియోగించవచ్చన్నారు. ఆకులు, రంపపు పొట్టు, ఎండు మొక్కలు కొమ్మలు కాల్చిన బూడిద వాడి కంపోస్టు తయారుచేసుకోవచ్చని ఆయన తెలిపారు. 15 రోజుల్లోనే..! కంపోస్టును 15 రోజుల్లో కూడా తయారుచేసుకోవచ్చని దేవినేని మధుసూదనరావు (99890 51200) అంటున్నారు. ఎంత త్వరగా కంపోస్టు కావాలనుకుంటే అన్ని ఎక్కువసార్లు తిరగెయ్యాలి... అంతే!15 రోజుల్లో కంపోస్టు అవాలనుకుంటే.. దిబ్బను ప్రతి రోజూ తిరగెయ్యాలి. 90 రోజుల్లో తయారుకావాలనుకుంటే.. వారానికోసారి తిరగెయ్యాలి. 30 రోజులకోసారి తిరగేస్తే.. ఏడాది పడుతుంది! ‘ఇంటి పంట’ @ ‘సాక్షి’... ‘సాక్షి’ చేపట్టిన ‘ఇంటి పంట’ యజ్ఞంలో ఉరకలెత్తే ఉత్సాహంతో పాలుపంచుకుంటున్న పాఠకులకు అభినందనలు. మీ ‘ఇంటి పంట’ అనుభవాలు రాయండి. ఫొటో కూడా పంపండి. సందేహాలుంటే.. సంబంధిత వివరాలన్నీ రాయండి. intipanta@sakshi.com కు ఈమెయిల్ పంపవచ్చు. ‘ఎడిటర్, ఇంటి పంట, స్పెషల్ డెస్క్, సాక్షి దినపత్రిక, 6-3-249/1, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 500 034’ కు ఉత్తరం రాయొచ్చు. మీ పేరు, ఊరు, జిల్లా తప్పక తెలపండి. |
Monday, 21 March 2011
పెరట్లో ఆకు ఎరువు ఇలా
Subscribe to:
Post Comments (Atom)

కంపోస్టును 15 రోజుల్లో కూడా తయారుచేసుకోవచ్చని దేవినేని మధుసూదనరావు (99890 51200) అంటున్నారు. ఎంత త్వరగా కంపోస్టు కావాలనుకుంటే అన్ని ఎక్కువసార్లు తిరగెయ్యాలి... అంతే!
No comments:
Post a Comment