Monday, 21 March 2011

తియ్యటి దివ్యౌషధం


విష రసాయనాలు వాడకుండా ఇంటిపట్టునే సేంద్రియ పద్ధతుల్లో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవడం ఎలాగో ‘ఇంటి పంట’ శీర్షికలో గత రెండు నెలలుగా చర్చించుకుంటున్నాం కదా.. ఆరోగ్యానికి హాని కలిగించని స్వచ్ఛమైన ఆహారం ఉన్నంతలో తమకు తామే పండించుకోవాలన్న తపన నగరాలు- పట్టణాల్లో నివసించేవారిలో కూడా నానాటికీ పెరుగుతోంది.

‘ఇంటి పంట’ కథనాలకు రాష్ట్రం నలుమూలల నుంచి పాఠకులు స్పందిస్తున్నారు. అయితే, ‘ఇంటి పంట’లతో పాటు అతిముఖ్యమైన కొన్ని ఔషధ మొక్కలు కూడా పెంచుకుంటే బాగుంటుందన్న అభిలాషను కొందరు పాఠకులు వ్యక్తంచేస్తున్నారు. వారి కోరిక మేరకు.. అందరి ఇళ్లలో ఇప్పటికే అందుబాటులో ఉండే తులసి వంటి ఔషధ మొక్కలను కాకుండా... కొన్ని అరుదైన ఔషధ మొక్కలను పాఠకులకు పరిచయం చేయాలని ‘సాక్షి’ భావిస్తోంది. ఈ పరంపరలో ‘స్టీవియా’ మొదటిది.

స్టీవియా... మధుమేహం ఉన్న వారూ నిర్భీతిగా తియ్యదనాన్ని ఆస్వాదించడానికి అవకాశం కల్పిస్తున్న అరుదైన మొక్క ఇది. తెలుగులో దీన్ని ‘తీపి మొక్క’ అనొచ్చు. మధుమేహాన్ని బొత్తిగా పెంచని మహా తీపి ఔషధ మొక్క ఇది! చక్కెరకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ తీపినిచ్చే ఈ మొక్క.. అసలు ఏమాత్రం షుగర్‌ను పెంచదంటే ఆశ్చర్యం కలగొచ్చు.. కానీ ఇది నిజంగా నిజం!!

ఆసియాలో పుట్టిన ఈ మొక్క దక్షిణ అమెరికా అడవుల్లో వర్థిల్లింది. రెండొందల ఏళ్లుగా గిరిజనులు వాడుతున్న ఈ మొక్క గురించి జపాన్, కొరియా వంటి దేశాల్లో విస్తృతంగా పరిశోధన జరుగుతోంది. దీన్ని పొలాల్లో.. ఇంటి పట్టున కుండీలు, మడుల్లోనూ స్టీవియాను నిక్షేపంగా పెంచవచ్చు. రెండు నుంచి రెండున్నర అడుగుల ఎత్తు పెరుగుతుంది. 3 నెలల్లో కోతకు వస్తుంది. పూత కనిపించగానే మొక్కను కత్తిరించవచ్చు. దీన్ని ఒకసారి తెచ్చుకొని నాటితే చాలు. తామర తంపరగా పిలకలు వస్తూనే ఉంటాయి. కొమ్మను తుంచి నాటినా సులభంగానే 10 - 15 రోజుల్లో వేరుపోసుకుంటుంది. అంటే.. ఈ తీపిమొక్కను మళ్లీ మళ్లీ కొనుక్కోనక్కర్లేదన్న మాట! సాధారణంగా ఎండను ఇష్టపడే ఈ మొక్క.. 35 డిగ్రీలకు మించిన వేడిని భరించలేదు. పొలాల్లో సాగుచేస్తే స్ప్రింక్లర్లు అమర్చుకోవాల్సి ఉంటుంది. ఇంటి వద్ద, మేడపైన కుండీలు, మడుల్లో నిస్సందేహంగా పెంచుకోవచ్చు. ఎండ తక్కువగా తగిలే చోట అంతగా ఎత్తు పెరగకపోవచ్చు. 35 డిగ్రీలకన్నా ఎక్కువ వేడి ఉండేపనైతే షేడ్‌నెట్ ఏర్పాటుచేసుకుంటే.. ఏ కాలంలోనైనా స్టీవియా తియ్యటి ఆకులు , మధుమేహం ఉన్న వారితో సహా, ఇంటిల్లిపాదికీ నోరూరిస్తూనే ఉంటాయి! స్టీవియా ఆకులు, కాండం కూడా ఔషధగుణాలు కలిగి ఉన్న మొక్క. ఇందులో వృథా పోయేదేమీ ఉండదు.

టీ / కాఫీల్లో.. స్వీట్లలో..
స్టీవియా పొడిని, లేదా ఆకులను టీ, కాఫీ, శీతలపానీయాల్లో.. ఒకటేమిటి తియ్యటి పిండివంటల్లోనూ పంచదార / బెల్లానికి బదులుగా వాడుకోవచ్చు. పచ్చి ఆకులు తినొచ్చు. ఆకును కొంచెం కొరికి బుగ్గన పెట్టుకుంటే.. తియ్యటి తాజాదనాన్నిస్తుంది. దీంట్లో ఒక్క కేలరీకూడా లేదు. తక్కువ కేలరీలు తినాలకునే వారికి ఎంతో ఉపకరిస్తుంది. కూరల్లో కూడా వేసుకోవచ్చు! ఔషధంలా మాత్రమే కాకుండా.. ఫుడ్ సప్లిమెంట్‌గా ఇంటిల్లిపాదీ వాడుకోవడానికి వీలైన మొక్క స్టీవియా.

స్టీవియా జ్యూస్
స్టీవియా ఆకులు, కాండం పొడితో రసం తయారుచేసుకొని.. ఫ్రిజ్‌లో 3 వారాల వరకూ నిల్వ చేసుకొని అవసరమైనప్పుడల్లా వాడుకోవచ్చు. కప్పు పొడికి 5 కప్పుల నీరు జోడించి 15 - 20 నిమిషాలు మరగకాయాలి. ఆ తర్వాత 12 గంటల పాటు దానికదే చల్లారనివ్వాలి. వడకట్టి వాడుకోవచ్చు. ఫ్రిజ్‌లో కాకుండా నిల్వచేయాలంటే.. ప్రిజర్వేటివ్‌లు కలపాల్సి ఉంటుంది. అయితే, తాజాగా వాడుకోవడమే ఉత్తమం.

ప్రాచుర్యంలోకి తెచ్చిన విశ్రాంత ఇంజనీర్
స్టీవియాను హైదరాబాద్‌లో నివసిస్తున్న కలవలపల్లి వెంకట రమణారావు (93911 57340 / 040- 23811220) అనే విశ్రాంత ఇంజనీర్ తెలుగునాట ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఆయన స్వయంగా రంగారెడ్డి

ఇది సర్వరోగ నివారిణి!

స్టీవియా మధుమేహం ఉన్న వారికే కాదు.. అందరికీ దివ్యమైన సంపూర్ణ ఔషధం. ప్రపంచ ఆహార సంస్థ, జాతీయ పోషకాహార సంస్థ దీన్ని ఆమోదించాయి. సర్వరోగ నివారిణి. స్టీవియా పొడి చక్కెర కన్నా 20-30 రెట్టు తియ్యనిది. దీని రసం చక్కెర కన్నా వంద రెట్లు తియ్యగా ఉంటుంది. రిఫైన్డ్ వైట్ స్టీవియా పౌడర్ ఇంకా ఎక్కువ తియ్యగా ఉంటుంది. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్. లివర్‌లో మలినాలను శుద్ధిచేయడంతోపాటు ఎన్నో వ్యాధులను పారదోలుతుంది.

నాకు తెలిసిన నలుగురికి కేన్సర్ కూడా నయమైంది. ప్లేట్‌లెట్స్ వంటి తీవ్ర వ్యాధులూ తగ్గుతున్నాయి. వీటికి నా దగ్గర రుజువులున్నాయి. అద్భుతమైన ఈ ఫలితాలు చూసి.. ప్రభుత్వ రంగ సూపర్‌స్పెషాలిటీ వైద్యులు ప్రత్యేక పరిశోధనలు ప్రారంభించారు. ఈ దివ్యౌషధాన్ని నలుగురికీ అందుబాటులోకి తేవడంతో నా జన్మ ధన్యమైంది.
- కలవలపల్లి వెంకట రమణారావు, హైదరాబాద్

నిస్సందేహంగా వాడొచ్చు

రెండొందల ఏళ్ల నుంచి దక్షిణ అమెరికాలో గిరిజనులు వాడుతున్న ఈ మొక్కను తదనంతరకాలంలో అనేక దేశాల్లో వాడుతున్నారు. స్వీట్ తినలేం అనుకునే మధుమేహ రోగులు కూడా నిస్సందేహంగా వాడొచ్చు. ఇందులో కాలరీలు లేవు. షుగర్‌ను పెంచదు. పానీయాల్లోనే కాకుండా స్వీట్లలోనూ వాడొచ్చు. జపాన్, కొరియాల్లో దీనిపై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. స్టీవియా మొక్కను పొలాల్లోనే కాదు.. కుండీల్లోనూ చక్కగా పెంచుకోవచ్చు. విదేశీ మార్కెట్లలోనూ స్టీవియాకు గిరాకీ ఉంది.
- డాక్టర్ కొండపల్లి నరసింహారెడ్డి (98480 21691),
ఆయుర్వేద వైద్య నిపుణులు

రేపు ఉప్పల్‌లో ‘ఇంటి పంట’ వర్క్‌షాప్

‘ఇంటి పంట’ యజ్ఞంలో భాగంగా ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఈనెల 19వ తేదీ (శనివారం)న సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకూ ఉప్పల్ మెయిన్ రోడ్డులోని.. ‘సర్వే ఆఫ్ ఇండియా’ సంస్థ ఆవరణలో గల ఆడిటోరియంలో ‘ఇంటి పంట’ వర్క్‌షాప్ జరుగుతుంది. స్టీవియా మొక్కలు, కొబ్బరి పొట్టుతో తయారుచేసిన సేంద్రియ ఎరువు, కుండీలు.. అందుబాటులో ఉంటాయి. రాజేంద్రనగర్‌లోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న వ్యవసాయ పరిశోధన సంస్థ(ఏఆర్‌ఐ)లోని కూరగాయల పరిశోధన విభాగం వారి కూరగాయలు, ఆకుకూరల విత్త నాలు లభిస్తాయి. అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. పాల్గొనదలచిన వారు 040- 23303849 నంబర్‌కు (ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య) ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోవచ్చు.

విత్తనాలు దొరకట్లేదా?

ఇంటి వ ద్ద కూరగాయాలు పండించుకుందామంటే విత్తనాలు లభించట్లేదా? ఎక్కడ దొరుకుతాయో తెలియట్లేదా? రాజేంద్రనగర్‌లోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న వ్యవసాయ పరిశోధన సంస్థ(ఏఆర్‌ఐ)లోని కూరగాయల పరిశోధన విభాగంలో కిచెన్ గార్డెన్ కిట్స్ లభిస్తున్నాయి. ఇందులో దాదాపుగా 12 రకాల కూరగాయలు, ఆకు కూర మొక్కల విత్తనాలు (టమాట, వంకాయ, బీర, సొర, కాకర, పొట్ల, తోటకూర, పాలకూర, గోంగూర, బెండ, చిక్కుడు సహా) లభిస్తాయి. ఈ కిట్ ధర * 25 మాత్రమే. వివరాలకు 040-24018016 నంబర్‌లో సంప్రదించవచ్చు.

No comments:

Post a Comment