Sunday, 20 March 2011

చెత్తతో చక్కని కంపోస్టు


పలవునేరు మున్సిపాలిటీలో
వ్యర్థాలతో వినూత్న ప్రయోగం
కంపోస్టు తయారీతో
బహుళ ప్రయోజనాలు

సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండించాలనుకునే వారికి కంపోస్టు చాలినంత అందుబాటులో లేకపోవడం ప్రతి పట్టణంలోనూ ఉన్న సమస్యే అనుకుంటుంటాం! అయితే, అటువంటి పట్టణాల జాబితా నుంచి చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణాన్ని మినహాయించి తీరాల్సిందే. ఎందుకంటే.. అక్కడ నాణ్యమైన కంపోస్టు బస్తాలకు బస్తాలు అమ్మకానికి సిద్ధంగా ఉంది!!

కాదేదీ కంపోస్టుకు అనర్హం అన్నట్టు.. 24 వార్డుల్లోని ఇళ్ల నుంచి అనుదినం సేకరిస్తున్న చెత్తతో.. చక్కగా కంపోస్టు తయారుచేస్తోంది పలవునేరు మున్సిపాలిటీ. మున్సిపాలిటీలలో రోజూ టన్నులకొద్దీ పోగుపడే చెత్తతో కంపోస్టు తయారుచేయాలంటూ పదేళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. చాలా మున్సిపాలిటీల్లో ఆ ఊసే ఇప్పటికీ లేదు. కొన్ని చోట్ల తూతూ మంత్రంగా జరుగుతోంది.

అయితే, ప్రత్యేక శ్రద్ధతో.. వ్యక్తిగత పర్యవేక్షణలో.. చెత్తతో కంపోస్టు తయారుచేయిస్తూ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు పలమనేరు మున్సిపల్ కమిషనర్ అన్నవరపు వెంకటేశ్వర్లు(99498 87727). ఫలితంగా పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితి మెరుగవడం, పర్యావరణ కాలుష్యం తగ్గడంతోపాటు..మున్సిపాలిటీ కి అదనపు ఆదాయం సమకూరుతోంది. అన్నిటికీ మించి.. విష రసాయనాలు లేకుండా పంటలు పండించుకోవడానికి ప్రజలకు కంపోస్టు అందుబాటులోకి వచ్చింది!

ఇదీ కంపోస్టు చేస్తున్న తీరు..
పలమనేరులో ప్రతి ఇంటి నుంచి రోజూ 21 మెట్రిక్ టన్నుల చెత్త వస్తుంది. ప్లాస్టిక్ తదితరాలు పోను.. 16 టన్నుల చెత్తను (ఏరోబిక్.. ఆక్సిజన్ తగిలే పద్ధతిలో) కంపోస్టు తయారీకి వినియోగిస్తున్నారు. ఆ చెత్తను యంత్రం సహాయంతో చిన్న ముక్కలుగా కత్తిరించి.. నేలపైనే కంపోస్టు దిబ్బలు వేస్తున్నారు. 10 అడుగుల పొడవు, 4 అడుగుల వెడ ల్పు, 5 అడుగుల ఎత్తులో కంపోస్టు దిబ్బలు వేస్తారు. ఇలా ప్రతి రోజూ 3 వేస్తున్నారు. దిబ్బల్లో తగినంత తేమ ఉండేలా చేసేందుకు మూడు రోజులకోసారి నీరు చల్లుతారు. నెలకోసారి ఈ దిబ్బలను తీసి.. పేడ నీళ్లు చల్లి తిరగేస్తే.. 90 రోజుల్లో కంపోస్టు సిద్ధమవుతోంది. దిబ్బను తిరగేయడానికి ముందు వారం రోజులు నీళ్లు చల్లకూడదు. ఒకటికి రెండుసార్లు జల్లించి.. చక్కని కంపోస్టును బస్తాల్లో నిల్వ చేస్తున్నారు.

ఇది కంపోస్టు యార్డు.. డంపింగ్ యార్డు కాదు!
ఈ కంపోస్టు అన్నివిధాలా నాణ్యంగా ఉందని తిరుపతిలోని వ్యవసాయ శాఖకు చెందిన లేబొరేటరీలో పరీక్ష చేయించగా తేలింది. దాదాపు ఏడాది క్రితం నుంచి నిబద్ధతతో కంపోస్టు తయారీ పని జరుగుతోంది. 2010 సెప్టెంబర్ నుంచి కంపోస్టు అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకూ 75 టన్నుల కంపోస్టు తయారవగా.. టన్ను రూ.2 వేలు చొప్పున పది టన్నులు రైతులకు అమ్మారు. ప్రస్తుతం రోజుకు 2 మెట్రిక్ టన్నుల సేంద్రియు ఎరువు పలమనేరు డంపింగ్... కాదు, కాదు.. కంపోస్టు యార్డులో తయూరవుతోంది! ఇప్పుడు అక్కడ 130 కంపోస్టు దిబ్బలున్నాయి. రోజూ వేసేదిబ్బలు వేస్తుంటే.. తీసే దిబ్బలు తీస్తున్నారు.

అడ్డదిడ్డంగా నిండిపోయి కుళ్లి కంపుకొట్టే డంపింగ్ యార్డు.. చక్కని కంపోస్టు యార్డుగా మారిపోయింది! అధికారుల్లో ప్రత్యేక శ్రద్ధ ఉండాలే గాని.. చెత్తనూ బంగారం చేయొచ్చనడానికి ఈ ప్రాంగణమే నిదర్శనం. చెత్త సేకరణ, తరలింపు, పది మంది కూలీలు... అన్ని ఖర్చులూ పోను ఈ యార్డు ద్వారా నెలకు రూ.40 వేలు ఆదాయం మున్సిపాలిటీకి లభిస్తోంది.

వర్మీ కంపోస్టు తయారుచేయడం కూడా ఇటీవల ప్రారంభమైంది. ఈ కంపోస్టుతో యార్డులోనే జామ, క్యాబేజీ, మిరప, టమాటా మొక్కలు సాగు చేస్తున్నారు. ఏపుగా పెరుగుతున్న మొక్కలను చూసి రైతులు కంపోస్టు వాడకం గురించి గ్రహిస్తున్నారు. అన్ని మున్సిపాలిటీలు, నగరాల్లో ఇదే మాది రిగా చెత్తపై అధికారులు శ్రద్ధపెడితే.. ఇక ‘ఇంటి పంట’లకే కాదు.. పొలాల్లో సేంద్రియ సాగుకు సైతం కంపోస్టు కొరత ఉంటుందా?
(శుక్ర, శనివారాల్లో ఇక్కడే కలుద్దాం)
- న్యూస్‌లైన్, పలవునేరు రూరల్(చిత్తూరు)

వ్యర్థాలతో కంపోస్టు.. ప్రయోజనాలెన్నో!

పలమనేరులో ప్రతి ఇంటి నుంచీ చెత్తను పూర్తిగా సేకరిస్తుండడంతో వ్యర్థాల రహిత పట్టణంగా మారింది. చెత్తను పారేయడానికి ఏడాదికి ఎకరం స్థలం అవసరమయ్యేది. ఇక స్థలాన్ని కొనుగోలు చేయూల్సిన అవసరం తప్పింది. రెగ్యులర్‌గా ఇలాగే చేస్తే... మరో వందేళ్ల వరకూ ఇప్పుడున్న 10 ఎకరాల యార్డే సరిపోతుంది. పర్యావరణం కలుషితమవకుండా కాపాడగలుగుతున్నాం. పైగా వుున్సిపాలిటీకి ఆదాయుం కూడా వస్తోంది. నర్సరీల వాళ్లు కొబ్బరిపొట్టు, మా కంపోస్టు వాడుతున్నారు.

రైతులు కూడా కంపోస్టు వాడకం వల్ల కలిగే మేలును స్వానుభవంతో గ్రహిస్తున్నారు. వ్యక్తిగత శ్రద్ధ ఉంటే తప్ప ఈ పని చేయించడం కష్టం. రోజూ యూర్డు వద్దకు వెళ్లి పర్యవేక్షిస్తున్నాను. సిబ్బంది, కార్మికులు బాగా సహకరిస్తున్నారు. ఇది అవుతుందా, పోతుందా అని చాలా వుంది నవ్వుకున్నారు. ఈ రోజు కంపోస్టు వాడుతున్న రైతుల ముఖంలో ఆనందం చూసి చాలా గ్రేట్‌గా ఫీలవుతున్నా.
- అన్నవరపు వెంకటేశ్వర్లు,
మున్సిపల్ కమిషనర్, పలమనేరు (చిత్తూరు)

నేడే ఉప్పల్‌లో ‘ఇంటి పంట’ వర్క్‌షాప్

‘ఇంటి పంట’ యజ్ఞంలో భాగంగా ‘సాక్షి’ ఆధ్వర్యంలో సుస్థిర వ్యవసాయ కేంద్రం నిపుణుల తోడ్పాటుతో ఈనెల 19న (శనివారం) సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకూ ఉప్పల్ మెయిన్ రోడ్డులోని.. ‘సర్వే ఆఫ్ ఇండియా’ సంస్థ ఆవరణలో గల ఆడిటోరియంలో ‘ఇంటి పంట’ వర్క్‌షాప్ జరుగుతుంది.

స్టీవియా మొక్కలు, కొబ్బరి పొట్టుతో తయారుచేసిన సేంద్రియ ఎరువు, కుండీలు.. అందుబాటులో ఉంటాయి. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న వ్యవసాయ పరిశోధన సంస్థ(ఏఆర్‌ఐ)లోని కూరగాయల పరిశోధన విభాగం వారి కూరగాయలు, ఆకుకూరల విత్తనాలు లభిస్తాయి. అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం.

No comments:

Post a Comment