Monday, 28 February 2011

ఆకుకూరల సాగు ఇంటి పంట

నగరాలు, పట్టణాలు...
అపార్ట్‌మెంట్లలో...
కుండీలు,
కంటెయినర్లలో..

వంగ, టమాటా వంటి కూరగాయలు కూడా పెంచవచ్చు
కుండీల్లోనూ చక్కని దిగుబడి తీయొచ్చు
ర్యాక్‌లతో తక్కువ చోటులోనే ఎక్కువ కుండీలు పెట్టొచ్చు

నగరాలు, పట్టణాలలో జనాభా సాంద్రత అంతకంతకూ ఎక్కువవుతోంది. ఇళ్లు, బహుళ అంతస్థుల గ్రూప్ హౌస్‌లు లేదా అపార్ట్‌మెంట్ల వద్ద ఖాళీ స్థలం తక్కువగా ఉంటుంది.


కంటికి మట్టి కనపడకుండా అంతా గచ్చుమయంగా ఉండే ఇటువంటి చోట్ల ఆకుకూరలు, కూరగాయలు పెంచుకోవడం అసాధ్యమని అనిపించడం సహజం. అయితే, అందుకు అనేక మార్గాలున్నాయి. ఇంటి యజమానులకే కాదు, అద్దె ఇంట్లో ఉండే వారితోపాటు పల్లెవాసులు సైతం కుండీలు, కంటెయినర్లలో మొక్కలు పెంచుకోవచ్చు. ఇంటి ముందు, వెనుక, బాల్కనీలో, మేడ మీద.. కిచెన్ గార్డెన్ పెంచవచ్చు. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు కూడా.

మొక్కను బట్టి కుండీ: ఆకు కూరలు పెంచడానికి వెడల్పు ఎక్కువ, లోతు తక్కువ కుండీలు, కంటెయినర్లు సరిపోతాయి. కూరగాయ మొక్కలు, క్యారట్ వంటి దుంప జాతి మొక్కలు పెంచుకోవాలంటే లోతు ఎక్కువగా ఉండే కుండీలు, కంటెయినర్లు ఎంచుకోవాలి. ఆకు కూరలు పెంచుకోవాలంటే కనీసం 4 అంగుళాల లోతు మట్టి పట్టే వెడల్పాటి కుండీలు లేదా అంత లోతుండే బల్లపరుపు ట్రేలను ఎంచుకోవాలి.

వంగ, చిక్కుడు, టమాటా వంటి కూరగాయలు, బీర, పొట్ల వంటి తీగజాతి కూరగాయలు పెంచుకోవాలంటే 4 నుంచి 6 అంగుళాల లోతు మట్టి ఉండే కుండీలు, ట్రేలను ఎంపికచేసుకోవాలి. క్యారట్, ముల్లంగి వంటి దుంప జాతి మొక్కలు పెంచుకోవాలంటే మరికొంత లోతు ఉండే కుండీలు, కంటెయినర్లు ఎంచుకోవాలి.

కుండీలు: సిమెంటు, మట్టి, ప్లాస్టిక్ కుండీల్లో కూరగాయలు పెంచవచ్చు. చెక్కతో చేసిన పెట్టెలు, ప్లాస్టిక్ జార్లు, క్యాన్లు, బక్కెట్లు, టిన్ బాక్సులు, డ్రమ్ములలో మొక్కలు నిక్షేపంగా పెంచుకోవచ్చు.

అంతేకాదు అల్యూమినియం లేదా ఫైబర్‌తో తయారుచేసిన నలుచదరపు కంటెయినర్లలోనూ పెంచుకోవచ్చు. కుండీలతో ఉండే సౌలభ్యం ఏమిటంటే ఎంత సైజులో కావాలంటే అంతసైజువి ఎంపికచేసుకోవచ్చు. ఏ కుండీలో ఏ మొక్కలు పెంచదలచుకున్నామన్న దాన్ని బట్టి... కుండీ షేపు, లోతు, వెడల్పు, సైజు ఎంత ఉంటే బావుంటుందన్న విషయం నిర్ధారించుకోవచ్చు.

తగుమాత్రంగానే నీరు: మొక్కలకు తగుమాత్రంగానే నీరు పోయాలి. కుండీలో మట్టి బాగా తడిగా ఉంటే ఆ రోజుకు నీరు పోయనక్కర లేదు. మట్టి తేమగా ఉంటే చాలు. మరీ నీరు ఎక్కువైనా మొక్క చనిపోతుంది. అతి జాగ్రత్తగా నీరు మరీ ఎక్కువ పోస్తే.. నాటిన చేతులతో మనమే మొక్కను చంపుకున్నవాళ్లమవుతాం.

నిలువ నీరు హానికరం: ఎక్కువైన నీరు కుండీలో లేదా కంటెయినర్‌లో నిలవకుండా చూసుకోవాలి. ఇందుకోసం కుండీ లేదా కంటెయినర్ అడుగున కనీసం ఒక రంధ్రమైనా ఉండాలి. సాధారణంగా కుండీకి రెండు, మూడు రంధ్రాలుంటాయి. పొడవాటి ట్రేలు, కంటెయినర్లకు మరిన్ని రంధ్రాలు పెట్టాలి. కుండీలో నీరు నిల్వ ఉంటే ఎక్కువ సేపు తేమ ఉంటుంది అని అనుకోవడం మొక్క మనుగడకే ప్రమాదం. మొక్కల పనులు చేయాలంటే పిల్లలు సరదా పడుతుంటారు. ఏ కుండీలో ఎంతెంత నీరు పోయాలో పిల్లలకు నేర్పండి. మర్చిపోకుండా క్రమం తప్పకుండా పోస్తారు. తాము పోసిన నీరుతో మొక్క రోజుకో తీరున పెరుగుతుంటే చూసి వారు పొందే ఆనందం అంతా ఇంతా కాదు.

ఒకే కుండీలో రెండు రకాల మొక్కలు: కుండీ ఒకటే అయినా రెండు రకాల మొక్కలు పెంచుకోవచ్చు. ఉదాహరణకు... వంగ మొక్కలు రెండు ఒక కుండీలో పెట్టామనుకోండి. అది రెండు జానల ఎత్తు పెరిగిన తర్వాత... అదే కుండీలో వంగ మొక్క చుట్టూ ఉండే ఖాళీలో కొత్తిమీర, పుదీన, మెంతి కూర, అల్లం... వంటి ఎత్తు తక్కువ పెరిగే మొక్కలేవైనా వేసుకోవచ్చు.

తక్కువ చోటులో ఎక్కువ కుండీలు: కుండీలు ఇండిపెండెంట్ ఇళ్లు లాంటివి. ఇంటి దగ్గర ఉన్న కొంచెం ఖాళీ కొన్ని కుండీలతోనే నిండిపోతుంది. అలాంటప్పుడు అపార్ట్‌మెంట్ల మాదిరిగా బహుళ అంతస్థుల్లో మొక్కలు పెంచుకునే ఉపాయం ఆలోచించవచ్చు. చెట్టు ఆకారంలో ఇనుప చువ్వలతో ర్యాక్ చేయించుకుంటే... ఒకటి రెండు కుండీలు పట్టే చోటులోనే ఐదారు కుండీలు మోసే ‘ఇనుప చెట్టు’లాంటి ర్యాక్‌ను పెట్టుకోవచ్చు.

మీ ఇంటి పరిసరాలను దృష్టిలో ఉంచుకొని.. మీకు అందుబాటులో ఉన్న మెటీరియల్‌తో.. మరో విధంగా ఏమైనా చేయొచ్చేమో కూడా ఆలోచించండి.

మట్టి.. ఎరువులు: నాణ్యమైన మట్టి, సేంద్రియ ఎరువుల మిశ్రమాన్ని వినియోగిస్తే కూరగాయ మొక్కలు పోషకలోపం లేకుండా చక్కగా పెరిగి మంచి దిగుబడినిస్తాయి.

కుండీలో మట్టి పిడచగట్టుకు పోకుండా ఉంటే మొక్క చక్కగా పెరుగుతుంది. నల్లమట్టికి గట్టిపడే స్వభావం కలిగి ఉంటుంది. కాబట్టి ఎరమ్రట్టిని వినియోగించడం మంచిది. ఎరమ్రట్టి బొత్తిగా దొరకనప్పుడు నల్లమట్టిని తక్కువ పాళ్లలో వాడుకోవచ్చు. కూరగాయలు, ఆకుకూరల పెంపకానికి సేంద్రియ ఎరువులు, సేంద్రియ పురుగుమందుల వాడకం ఉత్తమం. ఎరమ్రట్టికి, పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు సమపాళ్లలో కలిపి మొక్కలు పెంచవచ్చు. వేప గింజల పిండి, కానుగ పిండి, సీతాఫలం గింజల పిండి కూడా కలిపితే చీడపీడలను నివారించుకోవచ్చు.

కొబ్బరి పీచుతో...: కొబ్బరి పీచు తీసినప్పుడు వచ్చే పొట్టు కూడా చక్కని సేంద్రియ ఎరువే. మట్టి లేకుండా కేవలం కొబ్బరి పొట్టును వాడి ప్లాస్టిక్ ట్రేలలో నారు పెంచుతున్నారు. 40 రోజులపాటు ఆరోగ్యంగా మొక్కలు పెరుగుతున్నాయి. అంటే.. ఆకుకూరలు కూడా ఈ ట్రేలలో కొబ్బరి పీచుతో పెంచుకోవచ్చు.

కంపోస్టుతోనే..: మట్టితో పని లేకుండా వట్టి కంపోస్టుతో కూడా కూరగాయలు, ఆకుకూరల మొక్కలు పెంచుతున్నారు. మట్టితో పెంచినదానికన్నా కనీసం 3 రెట్లు అధిక దిగుబడి వస్తున్నదని అనుభవజ్ఞులు చెప్తున్నారు. కంపోస్టుతో జీవన ఎరువులు కలిపిన మిశ్రమంతోనూ ఆకు కూరలు, కూరగాయలు పెంచుకోవచ్చు.

విత్తనాలు: విత్తనాలు దుకాణాల్లో చిన్న ప్యాకెట్లలో కూడా అమ్ముతున్నారు. ఇరుగుపొరుగు వారి వద్ద నుంచో,పెరటి తోటలు పెంచే వారి దగ్గరి నుంచో సేకరించుకోవచ్చు. తోటకూర వంటి అతిచిన్న విత్తనాలను ఇసుకలో కలిపి చల్లుకోవచ్చు. మొత్తం మడిలా చల్లవచ్చు లేదా సాళ్ల మాదిరిగా చల్లవచ్చు.

ఆకుకూరలు సాధారణంగా చల్లిన నెల రోజుల్లో కోతకు వస్తాయి. పాలకూర, బచ్చలి కోస్తే మళ్లీ మొలకలు పెరుగుతాయి. తోటకూర కూడా మొలకలు పెరుగుతాయి. కానీ అంత నాణ్యంగా రావని అంటుంటారు. గోంగూర మొక్క నుంచి నెలల తరబడి ఆకులు కోసుకోవచ్చు.

ఏడాది పొడవునా పెంచవచ్చు: కూరగాయలు, ఆకుకూరలను ఏడాది పొడవునా పండించవచ్చు. అన్ని రకాల ఆకుకూరలు, వంగ, టమాటా, బెండ, క్యాప్సికమ్, మిరప, బీట్‌రూట్, క్యాలీఫ్లవర్, పుచ్చ... రకాలను నిశ్చింతగా సాగుచేయవచ్చు. కొత్తిమీర, కరివేపాకు, పుదీన వంటి వాటి గురించి ఇక ఆలోచించాల్సిన పనే లేదు.
ఎండ: అయితే.. ఏ మొక్కలకైనా ఎండ తగిలితేనే చక్కగా పెరుగుతాయి. రోజుకు కనీసం 5, 6 గంటల సేపైనా ఎండ తగిలే విధంగా కుండీలు, కంటెయినర్లను ఏర్పాటు చేసుకోవాలి.

ప్రతి 15 రోజులకోసారి మట్టిని గుల్లపరిచి గుప్పెడు వర్మీ కంపోస్టు లేదా పశువుల ఎరువు వేస్తే మంచిది. పంచగవ్య, వర్మివాష్ వంటి ద్రావణాలను 15 రోజలకోసారి చల్లితే చీడపీడలు దరిచేరవు.. పోషకాలు కూడా అందుతాయి.

ఏవైనా పురుగులు కనిపిస్తే వాటిని ఓపిగ్గా ఏరేయండి. ఒక కొమ్మకు తెగులు సోకితే ఆ కొమ్మ వరకూ కట్ చేసి నాశనం చేయడం శ్రేయస్కరం. ఎండలు ముదురుతున్నాయి కదా అని సందేహించకండి. ఏడాది పొడవునా అన్నికాలాల్లోనూ ఆకుకూరలు, కూరగాయలు పెంచుకోవచ్చు.

 ‘సాక్షి’ స్పెషల్ డెస్క్



కిచెన్ గార్డెన్‌కు ఇవి చాలు

చిన్న చిన్న ప్లాస్టిక్ ట్రేలు, పాత డబ్బాలు, ర్యాక్‌లు... కిచెన్ గార్డెన్‌కు ఇవి చాలు











1. అపార్ట్‌మెంట్ బాల్కనీలో...
2. పాత వాటర్ టిన్నులో..
3. పాలిథిన్ సంచుల్లో ఇలా..
4. తక్కువ స్థలంలో ర్యాక్‌లలో..
5. చిన్న ట్రేలో మెంతి కూర సాగు








ఇంటి పట్టునే ఆకు కూరలు, కూరగాయలు పండించుకోవాలనుకుంటున్నారా..?
‘అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాం.. మాకెలా కుదురుతుంది’ అనుకుంటున్నారా..?
పండించాలనే ఉంది కానీ.. మనకు పెద్దగా ఏం తెలియదు కదా.. అనుకుంటున్నారా..?
అయితే కచ్చితంగా మీరు ఈ కథనం చదవాల్సిందేనండోయ్..!
ఖర్చు అక్కర్లేకుండానే మీ ఇంట్లో ఉన్న వనరులతోనే కిచెన్ గార్డెన్‌ను ప్రారంభించవచ్చు.

అవునా... అదెట్లాగంటారా...? చదవండి.. ఎన్ని విధాలుగా.. ఎంత సులువుగా నవనవలాడే కమ్మటి ఆరోగ్యదాయకమైన ఆకు కూరలు, కూరగాయలు పండించుకోవచ్చో.. ఇట్టే తెలుస్తుంది.

ఇందులో ఒక రహస్యం ఉందండోయ్...!
అదేమిటంటే.. ఏమీ లేదు ఈ పని మీద మీ ఇంట్లో కనీసం ఒక్కరికైనా చాలా చాలా ఇష్టం ఉంటే చాలు..! ఇష్టమైన పని కష్టం కాదని తెలిసిందే కదూ...! కిచెన్ గార్డెన్ పెంపకం కూడా అంతే..! ఇష్టం.. సాధించాలన్న పట్టుదల ఉంటే.. పాత ప్లాస్టిక్ డబ్బానో కుండీగా మార్చేయండి.

పెట్రోలు ధరలు, కూరగాయల ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవడం ఎంత అవసరమో తెలియనిది కాదు. భారీ ప్రణాళికలు, భారీ ఖర్చు అవసరం లేదు. ఏదో ఒక పాత డబ్బా, పాత బక్కెట్.. మట్టిదో సిమెంటుదో కుండీ చూసుకొని కొంచెం మట్టిలో కొంచెం కంపోస్టు, కొద్దిగా ఇసుక కలిపి పోసి నాలుగు విత్తనాలు చల్లండి.. చాలు.. మీ ఇంట్లో కిచెన్ గార్డెన్ ప్రారంభమైనట్టే..! ఇలా ఉన్నంతలో కిచెన్ గార్డెన్‌ను ముందు ప్రారంభిస్తే.. ఆ రుచి తెలిస్తే.. తర్వాత కిచెన్ గార్డెన్‌ను మరింత విస్తృతం చేసుకోవచ్చు. ఏమంటారు..?
అపార్ట్‌మెంట్లు...
ఇంటి చుట్టూ ఖాళీ స్థలం ఉండే ఇంటి యాజమానులకో.. గ్రామీణులకో వీలయ్యే పని పట్టణంలోనో, మహానగరంలోనో ఉంటున్న మనకు ఎక్కడ కుదురుతుందిలే ఇంటి దగ్గర కూరగాయలు పెంచడం అని అనిపిస్తుంది... చటుక్కున! కానీ.. అలా అనుకోనక్కర లేదు.

జనంతో కిటకిటలాడే నగరాలు, పట్టణాలే కాదు మేజర్ పంచాయతీల్లో సైతం అపార్ట్‌మెంట్ల సంస్కృతి ప్రబలుతోంది. ఖాళీ స్థలం లేని అపార్ట్‌మెంట్లలో సైతం.. ఎండ తగిలే చోటుల్లో ఉన్నంతలో చోటుచేసుకొని నాలుగు కుండీలు పెట్టుకోవచ్చు. ఇంటి యజమానులైతే ఎన్ని పాట్లయినా పడొచ్చు. అద్దెకుంటున్న మాకెట్లా కుదురుతుందీ అనుకుని సదాశయం కోసం మొలకెత్తిన ఆలోచనను మానుకునేరు.. అద్దె అపార్ట్‌మెంట్లలో ఉండే వాళ్లు కూడా నాలుగు ప్లాస్టిక్ ట్రేలను గ్రిల్స్‌కు వేలాడదీసి... నాలుగు రకాలు ఆకు కూరలు నిక్షేపంగా పెంచుకోవచ్చండీ...! ఉన్న కొద్ది స్థలంలో ఎలా అనుకోకండి.

గ్రిల్స్‌కు వేలాడుతూ పచ్చని మారాకులు వేస్తూ మొక్కలు ఎదుగుతుంటే మనసుకు ఎంత హాయిగా ఉంటుంది చెప్పండి..! అయితే ఎండ బొత్తిగా తగలకపోతే ఆకు కూరలు, కూరగాయల మొక్కల్లో పెరుగుదల మందగిస్తుంది. నీడగా ఉంటే క్యారట్, ఉల్లి, అల్లం వంటి దుంపజాతి మొక్కలు బాగానే పెరుగుతాయి.

కుండీల్లో..
అనేక రకాల కుండీల్లో కూరగాయల మొక్కలు పెంచుకోవచ్చు. సిమెంట్ కుండీలు, మట్టి కుండీలు, అడుగు చిల్లు పడిన లేదా పగిలిన బక్కెట్, క్యాన్, ప్లాస్టిక్ జార్లు, డ్రమ్ములు.. వేటినైనా కుండీలుగా మార్చి విత్తనాలు వేయొచ్చు.

అడుగు వెడల్పున ఉండే పల్చటి చెక్క ముక్కలను చుట్టూ పెట్టి మధ్యలో మట్టి, కంపోస్టు మిశ్రమం పోసి మొక్కలు పెంచొచ్చు. ఎక్కువైన నీరు బయటకు పోయేలా అడుగున రంధ్రం ఉండాలి. ఆ రంధ్రం పూడిపోకుండా కొన్ని పెంకు ముక్కలో, పల్చని రాళ్ల ముక్కలో వేసి.. ఆపైన కొన్ని ఎండు ఆకులు వేసి.. మట్టి, కంపోస్టు మిశ్రమాన్ని కుండీలో పోయాలి. కుండీలో మట్టి మిశ్రమం నింపిన తర్వాత అది పూర్తిగా కింది వరకూ తడిసేలా నీరు పోయాలి. లేదా దానికన్నా పెద్ద బక్కెట్ నీటిలో పెట్టి గాలి అంతాపోయి కుండీలో మట్టి అంతా తడిసే వరకూ కొద్ది నిముషాలు ఉంచి, కుండీని బయటకుతీయాలి. అదనంగా కుండీలో ఉన్న నీరు కుండీ కింది రంధ్రం నుంచి బయటకు వెళ్లిపోతాయి. అలా వెళ్లకపోతే ఆ కుండీ సరిగా లేనట్టే. తగుమాత్రంగా తడిలో మాత్రమే మొక్క ఏపుగా పెరుగుతుంది. ఎక్కువ వున్న నీరు బయటకు పోని కుండీలో మొక్కలు ఎన్నాళ్లో బతకవు. కుండీలో మట్టి బాగా తడిగా ఉంటే ఆ రోజుకు నీరు పోయకుండా ఉంటేనే మంచిది. అతి తేమ మొక్కకు హానికరం సుమా..!
మడుల్లో...

సాధారణంగా నేలలో పెంచడం కన్నా ప్రత్యేకంగా సిద్ధంచేసిన ఎరమ్రట్టి, కంపోస్టు మిశ్రమంలో కూరగాయల మొక్కలు చక్కగా పెరుగుతాయి. ఎరమ్రట్టి, కంపోస్టు మిశ్రమంలో పెంచుతున్నందున మామూలుకన్నా కనీసం 3 రెట్లు దిగుబడి వస్తుంది. నీటి అవసరం తక్కువ. కలుపు రాదు. శ్రమ తక్కువ. నలుచదరంగా ఇటుకలు పేర్చిన మడుల్లో కూరగాయలు,ఆకు కూరలు పెంచవచ్చు.

నీరు పరిమితంగా చల్లుతాం కాబట్టి సిమెంటుతోనో, మట్టితోనో మడి చుట్టూ ఇటుకల గోడ కట్టనక్కరలేదు. మేడపై ఏర్పాటు చేసే మడి కింద (ఎంత స్థలంలో మడిని ఏర్పాటు చేయాలనుకుంటే అంతమేరకు) ప్లాస్టిక్ షీట్‌ను మేడపైన పరవాలి. స్లాబ్ నుంచి కిందికి నీటి ఊట ఇంట్లోకి దిగకుండా ఇది అడ్డుకుంటుంది. మడిలో చల్లిన నీటిలో ఎక్కువైన నీరు ఇటుకల కింది నుంచి బయటకు పోతుంది. మేడపై ఏర్పాటు చేసే మడి కిందే కాదు, నేలపై ఏర్పాటు చేసే మడి కింద కూడా ప్లాస్టిక్ షీట్ వేసుకోవాలి. మడి వెడల్పు 4 అడుగులు ఉంటే బాగుంటుంది.

పొడవు ఎంత స్థలం ఉంటే అంత పెట్టుకోవచ్చు. మట్టి, కంపోస్టు మిశ్రమాన్ని పోసి.. విత్తనాలు వేయాలి. విత్తనాలపై అంగుళం మందాన కంపోస్టు లేదా మట్టి, కంపోస్టు మిశ్రమం చల్లాలి. మొక్కలకు కనీసం 5,6 గంటల పాటు ఎండ తగలడం అవసరం. పురుగులు, చీడపీడలను నివారించడానికి 15 రోజులకోసారి పంచగవ్య వంటి మిశ్రమాలను చల్లుకోవచ్చు. 5 లీటర్ల నీటిలో అర లీటరు కలిపి తగుమాత్రంగా పిచికారి చేయాలి. ఏ రెమ్మ మీద పురుగు, తెగులు కనిపించినా దాన్ని తుంచి పారేయడం ఉత్తమం..

ఏఏ కూరగాయలు పెంచొచ్చు..?
ఏ కూరగాయలు, ఆకు కూరలైనా ఏడాది పొడవునా పండించుకోవచ్చు. విత్తనాలు నాణ్యమైనవైతే దిగుబడి బాగుంటుంది. టమాటా, వంగ, మిరప, బెంగళూరు మిరప, బెండ, చిక్కుడు, బీర, దోస, ఆనప తదితరాలను మడుల్లో, కుండీల్లో పండించుకోవచ్చు. ఇప్పటికే మొక్కలు పెంచుతున్న వారి వద్ద విత్తనం కాయల నుంచి విత్తనాలు సేకరించవచ్చు. పట్టణాలు, నగరాల్లో అయితే దుకాణాల్లో 10 గ్రాముల విత్తన ప్యాకెట్లు దొరుకుతున్నాయి.

ధనియాలు బాగా నలిచి బద్దలుగా పగిలిన తర్వాత రోజంతా నానబెట్టి చల్లితే చప్పున మొలుస్తాయి. దీంట్లో లోపల చిన్న సైజులో విత్తనం ఉండడమే ఇందుకు కారణం. తోటకూర వంటి విత్తనాలు గసగసాల మాదిరిగా చాలా చిన్నగా ఉంటాయి. ఇసుకలో కలిపి చల్లితే మరీ వత్తుగా పడకుండా ఉంటాయి. ఆకు కూరలు వారం తేడాతో కొంచెం కొంచెం విస్తీర్ణంలో విత్తనాలు చల్లుకుంటే నాలుగు రోజులకోసారి కూరకు అందివస్తాయి. మండు వేసవిలో గ్రీన్ షేడ్ ఏర్పాటుచేసి రక్షణ కల్పించుకోవాలి.

రసాయనిక ఎరువు ఎందుకు వాడకూడదు?
ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. ఇంత ఇష్టపడీ పండించుకునే ‘ఇంటి పంట’కు యూరియానో, మరో రసాయనిక ఎరువో, రసాయనిక పురుగుమందో చల్లకండి సుమా..! పాల గిన్నెలో ఉప్పు గల్లు వేసినట్టయిపోతుంది...! రసాయనిక ఎరువులతో పండించిన ఆహారం నాణ్యత సరిగా ఉండదు. వాటి రుచిలోనూ, నిల్వ ఉండకపోవడంలోనూ ఈ నాణ్యత లోపించడమన్నది కనపడుతుంది.

ఇంటి పట్టున సేంద్రియ పద్ధతుల్లో ఆకు కూరలు, కాయగూరలు ఎవరి అవకాశాన్ని బట్టి వారు పెంచుకోవడం ప్రారంభిస్తే.. ఇంటిల్లపాదీ సమతుల్యమైన ఆహారం తీసుకోవడం సులభ సాధ్యమవుతుంది. అపార్ట్‌మెంట్లలో, ఇళ్లపైన కుండీల్లో, మడుల్లో కూరగాయలు, ఆకు కూరల పెంపకం గురించి క్లుప్తంగా తెలుసుకున్నాం కదా.. మున్ముందు రోజుల్లో ఈ విషయాలను మరింత వివరంగా చర్చించుకుందాం. (శుక్ర, శనివారాల్లో ఇక్కడే కలుద్దాం..)
శుభస్య శీఘ్రం!
- సాక్షి స్పెషల్ డెస్క్
Date: 28/02/2011