చిన్న చిన్న ప్లాస్టిక్ ట్రేలు, పాత డబ్బాలు, ర్యాక్‌లు... కిచెన్ గార్డెన్‌కు ఇవి చాలు
1. అపార్ట్మెంట్ బాల్కనీలో...
2. పాత వాటర్ టిన్నులో..
3. పాలిథిన్ సంచుల్లో ఇలా..
4. తక్కువ స్థలంలో ర్యాక్‌లలో..
5. చిన్న ట్రేలో మెంతి కూర సాగు
2. పాత వాటర్ టిన్నులో..
3. పాలిథిన్ సంచుల్లో ఇలా..
4. తక్కువ స్థలంలో ర్యాక్‌లలో..
5. చిన్న ట్రేలో మెంతి కూర సాగు
ఇంటి పట్టునే ఆకు కూరలు, కూరగాయలు పండించుకోవాలనుకుంటున్నారా..? ‘అపార్ట్మెంట్లో ఉంటున్నాం.. మాకెలా కుదురుతుంది’ అనుకుంటున్నారా..? పండించాలనే ఉంది కానీ.. మనకు పెద్దగా ఏం తెలియదు కదా.. అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా మీరు ఈ కథనం చదవాల్సిందేనండోయ్..! ఖర్చు అక్కర్లేకుండానే మీ ఇంట్లో ఉన్న వనరులతోనే కిచెన్ గార్డెన్‌ను ప్రారంభించవచ్చు. అవునా... అదెట్లాగంటారా...? చదవండి.. ఎన్ని విధాలుగా.. ఎంత సులువుగా నవనవలాడే కమ్మటి ఆరోగ్యదాయకమైన ఆకు కూరలు, కూరగాయలు పండించుకోవచ్చో.. ఇట్టే తెలుస్తుంది. ఇందులో ఒక రహస్యం ఉందండోయ్...! అదేమిటంటే.. ఏమీ లేదు ఈ పని మీద మీ ఇంట్లో కనీసం ఒక్కరికైనా చాలా చాలా ఇష్టం ఉంటే చాలు..! ఇష్టమైన పని కష్టం కాదని తెలిసిందే కదూ...! కిచెన్ గార్డెన్ పెంపకం కూడా అంతే..! ఇష్టం.. సాధించాలన్న పట్టుదల ఉంటే.. పాత ప్లాస్టిక్ డబ్బానో కుండీగా మార్చేయండి. పెట్రోలు ధరలు, కూరగాయల ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవడం ఎంత అవసరమో తెలియనిది కాదు. భారీ ప్రణాళికలు, భారీ ఖర్చు అవసరం లేదు. ఏదో ఒక పాత డబ్బా, పాత బక్కెట్.. మట్టిదో సిమెంటుదో కుండీ చూసుకొని కొంచెం మట్టిలో కొంచెం కంపోస్టు, కొద్దిగా ఇసుక కలిపి పోసి నాలుగు విత్తనాలు చల్లండి.. చాలు.. మీ ఇంట్లో కిచెన్ గార్డెన్ ప్రారంభమైనట్టే..! ఇలా ఉన్నంతలో కిచెన్ గార్డెన్‌ను ముందు ప్రారంభిస్తే.. ఆ రుచి తెలిస్తే.. తర్వాత కిచెన్ గార్డెన్‌ను మరింత విస్తృతం చేసుకోవచ్చు. ఏమంటారు..? అపార్ట్మెంట్లు... ఇంటి చుట్టూ ఖాళీ స్థలం ఉండే ఇంటి యాజమానులకో.. గ్రామీణులకో వీలయ్యే పని పట్టణంలోనో, మహానగరంలోనో ఉంటున్న మనకు ఎక్కడ కుదురుతుందిలే ఇంటి దగ్గర కూరగాయలు పెంచడం అని అనిపిస్తుంది... చటుక్కున! కానీ.. అలా అనుకోనక్కర లేదు. జనంతో కిటకిటలాడే నగరాలు, పట్టణాలే కాదు మేజర్ పంచాయతీల్లో సైతం అపార్ట్మెంట్ల సంస్కృతి ప్రబలుతోంది. ఖాళీ స్థలం లేని అపార్ట్మెంట్లలో సైతం.. ఎండ తగిలే చోటుల్లో ఉన్నంతలో చోటుచేసుకొని నాలుగు కుండీలు పెట్టుకోవచ్చు. ఇంటి యజమానులైతే ఎన్ని పాట్లయినా పడొచ్చు. అద్దెకుంటున్న మాకెట్లా కుదురుతుందీ అనుకుని సదాశయం కోసం మొలకెత్తిన ఆలోచనను మానుకునేరు.. అద్దె అపార్ట్మెంట్లలో ఉండే వాళ్లు కూడా నాలుగు ప్లాస్టిక్ ట్రేలను గ్రిల్స్‌కు వేలాడదీసి... నాలుగు రకాలు ఆకు కూరలు నిక్షేపంగా పెంచుకోవచ్చండీ...! ఉన్న కొద్ది స్థలంలో ఎలా అనుకోకండి. గ్రిల్స్‌కు వేలాడుతూ పచ్చని మారాకులు వేస్తూ మొక్కలు ఎదుగుతుంటే మనసుకు ఎంత హాయిగా ఉంటుంది చెప్పండి..! అయితే ఎండ బొత్తిగా తగలకపోతే ఆకు కూరలు, కూరగాయల మొక్కల్లో పెరుగుదల మందగిస్తుంది. నీడగా ఉంటే క్యారట్, ఉల్లి, అల్లం వంటి దుంపజాతి మొక్కలు బాగానే పెరుగుతాయి. కుండీల్లో.. అనేక రకాల కుండీల్లో కూరగాయల మొక్కలు పెంచుకోవచ్చు. సిమెంట్ కుండీలు, మట్టి కుండీలు, అడుగు చిల్లు పడిన లేదా పగిలిన బక్కెట్, క్యాన్, ప్లాస్టిక్ జార్లు, డ్రమ్ములు.. వేటినైనా కుండీలుగా మార్చి విత్తనాలు వేయొచ్చు. అడుగు వెడల్పున ఉండే పల్చటి చెక్క ముక్కలను చుట్టూ పెట్టి మధ్యలో మట్టి, కంపోస్టు మిశ్రమం పోసి మొక్కలు పెంచొచ్చు. ఎక్కువైన నీరు బయటకు పోయేలా అడుగున రంధ్రం ఉండాలి. ఆ రంధ్రం పూడిపోకుండా కొన్ని పెంకు ముక్కలో, పల్చని రాళ్ల ముక్కలో వేసి.. ఆపైన కొన్ని ఎండు ఆకులు వేసి.. మట్టి, కంపోస్టు మిశ్రమాన్ని కుండీలో పోయాలి. కుండీలో మట్టి మిశ్రమం నింపిన తర్వాత అది పూర్తిగా కింది వరకూ తడిసేలా నీరు పోయాలి. లేదా దానికన్నా పెద్ద బక్కెట్ నీటిలో పెట్టి గాలి అంతాపోయి కుండీలో మట్టి అంతా తడిసే వరకూ కొద్ది నిముషాలు ఉంచి, కుండీని బయటకుతీయాలి. అదనంగా కుండీలో ఉన్న నీరు కుండీ కింది రంధ్రం నుంచి బయటకు వెళ్లిపోతాయి. అలా వెళ్లకపోతే ఆ కుండీ సరిగా లేనట్టే. తగుమాత్రంగా తడిలో మాత్రమే మొక్క ఏపుగా పెరుగుతుంది. ఎక్కువ వున్న నీరు బయటకు పోని కుండీలో మొక్కలు ఎన్నాళ్లో బతకవు. కుండీలో మట్టి బాగా తడిగా ఉంటే ఆ రోజుకు నీరు పోయకుండా ఉంటేనే మంచిది. అతి తేమ మొక్కకు హానికరం సుమా..! మడుల్లో... సాధారణంగా నేలలో పెంచడం కన్నా ప్రత్యేకంగా సిద్ధంచేసిన ఎరమ్రట్టి, కంపోస్టు మిశ్రమంలో కూరగాయల మొక్కలు చక్కగా పెరుగుతాయి. ఎరమ్రట్టి, కంపోస్టు మిశ్రమంలో పెంచుతున్నందున మామూలుకన్నా కనీసం 3 రెట్లు దిగుబడి వస్తుంది. నీటి అవసరం తక్కువ. కలుపు రాదు. శ్రమ తక్కువ. నలుచదరంగా ఇటుకలు పేర్చిన మడుల్లో కూరగాయలు,ఆకు కూరలు పెంచవచ్చు. నీరు పరిమితంగా చల్లుతాం కాబట్టి సిమెంటుతోనో, మట్టితోనో మడి చుట్టూ ఇటుకల గోడ కట్టనక్కరలేదు. మేడపై ఏర్పాటు చేసే మడి కింద (ఎంత స్థలంలో మడిని ఏర్పాటు చేయాలనుకుంటే అంతమేరకు) ప్లాస్టిక్ షీట్‌ను మేడపైన పరవాలి. స్లాబ్ నుంచి కిందికి నీటి ఊట ఇంట్లోకి దిగకుండా ఇది అడ్డుకుంటుంది. మడిలో చల్లిన నీటిలో ఎక్కువైన నీరు ఇటుకల కింది నుంచి బయటకు పోతుంది. మేడపై ఏర్పాటు చేసే మడి కిందే కాదు, నేలపై ఏర్పాటు చేసే మడి కింద కూడా ప్లాస్టిక్ షీట్ వేసుకోవాలి. మడి వెడల్పు 4 అడుగులు ఉంటే బాగుంటుంది. పొడవు ఎంత స్థలం ఉంటే అంత పెట్టుకోవచ్చు. మట్టి, కంపోస్టు మిశ్రమాన్ని పోసి.. విత్తనాలు వేయాలి. విత్తనాలపై అంగుళం మందాన కంపోస్టు లేదా మట్టి, కంపోస్టు మిశ్రమం చల్లాలి. మొక్కలకు కనీసం 5,6 గంటల పాటు ఎండ తగలడం అవసరం. పురుగులు, చీడపీడలను నివారించడానికి 15 రోజులకోసారి పంచగవ్య వంటి మిశ్రమాలను చల్లుకోవచ్చు. 5 లీటర్ల నీటిలో అర లీటరు కలిపి తగుమాత్రంగా పిచికారి చేయాలి. ఏ రెమ్మ మీద పురుగు, తెగులు కనిపించినా దాన్ని తుంచి పారేయడం ఉత్తమం.. ఏఏ కూరగాయలు పెంచొచ్చు..? ఏ కూరగాయలు, ఆకు కూరలైనా ఏడాది పొడవునా పండించుకోవచ్చు. విత్తనాలు నాణ్యమైనవైతే దిగుబడి బాగుంటుంది. టమాటా, వంగ, మిరప, బెంగళూరు మిరప, బెండ, చిక్కుడు, బీర, దోస, ఆనప తదితరాలను మడుల్లో, కుండీల్లో పండించుకోవచ్చు. ఇప్పటికే మొక్కలు పెంచుతున్న వారి వద్ద విత్తనం కాయల నుంచి విత్తనాలు సేకరించవచ్చు. పట్టణాలు, నగరాల్లో అయితే దుకాణాల్లో 10 గ్రాముల విత్తన ప్యాకెట్లు దొరుకుతున్నాయి. ధనియాలు బాగా నలిచి బద్దలుగా పగిలిన తర్వాత రోజంతా నానబెట్టి చల్లితే చప్పున మొలుస్తాయి. దీంట్లో లోపల చిన్న సైజులో విత్తనం ఉండడమే ఇందుకు కారణం. తోటకూర వంటి విత్తనాలు గసగసాల మాదిరిగా చాలా చిన్నగా ఉంటాయి. ఇసుకలో కలిపి చల్లితే మరీ వత్తుగా పడకుండా ఉంటాయి. ఆకు కూరలు వారం తేడాతో కొంచెం కొంచెం విస్తీర్ణంలో విత్తనాలు చల్లుకుంటే నాలుగు రోజులకోసారి కూరకు అందివస్తాయి. మండు వేసవిలో గ్రీన్ షేడ్ ఏర్పాటుచేసి రక్షణ కల్పించుకోవాలి. రసాయనిక ఎరువు ఎందుకు వాడకూడదు? ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. ఇంత ఇష్టపడీ పండించుకునే ‘ఇంటి పంట’కు యూరియానో, మరో రసాయనిక ఎరువో, రసాయనిక పురుగుమందో చల్లకండి సుమా..! పాల గిన్నెలో ఉప్పు గల్లు వేసినట్టయిపోతుంది...! రసాయనిక ఎరువులతో పండించిన ఆహారం నాణ్యత సరిగా ఉండదు. వాటి రుచిలోనూ, నిల్వ ఉండకపోవడంలోనూ ఈ నాణ్యత లోపించడమన్నది కనపడుతుంది. ఇంటి పట్టున సేంద్రియ పద్ధతుల్లో ఆకు కూరలు, కాయగూరలు ఎవరి అవకాశాన్ని బట్టి వారు పెంచుకోవడం ప్రారంభిస్తే.. ఇంటిల్లపాదీ సమతుల్యమైన ఆహారం తీసుకోవడం సులభ సాధ్యమవుతుంది. అపార్ట్మెంట్లలో, ఇళ్లపైన కుండీల్లో, మడుల్లో కూరగాయలు, ఆకు కూరల పెంపకం గురించి క్లుప్తంగా తెలుసుకున్నాం కదా.. మున్ముందు రోజుల్లో ఈ విషయాలను మరింత వివరంగా చర్చించుకుందాం. (శుక్ర, శనివారాల్లో ఇక్కడే కలుద్దాం..) శుభస్య శీఘ్రం! - సాక్షి స్పెషల్ డెస్క్ Date: 28/02/2011 |

చదవడానికి చాలా ఇబ్బంది గా వుంది
ReplyDeleteBack ground వల్ల చదవడానికి ఇబ్బంది గా వుంది
ReplyDelete