
ఆయన భార్య విజయలక్ష్మి ప్రతిరోజూ దాదాపు రెండు గంటలపాటు తమ మేడపైన ఉన్న కూరగాయల తోటలో గడుపుతారు. పురుగు కనపడితే ఆ ఆకునో, రెమ్మనో తుంపి నాశనం చేస్తారు.
మనోల్లాసంతోపాటు.. కాస్మిక్ ఎనర్జీ లభిస్తుందని దత్తు అన్నారు. వృద్ధాప్యంలోనూ తాము ఆరోగ్యంగా ఉండడానికి... ఇంటిపైనే స్వయంగా పండించుకు తింటున్న సేంద్రియ కూరగాయలే కారణమని ఆయన సంతోషంగా చెప్పారు. అమెరికాకు చెందిన మెల్బర్తోలోమి ప్రచారంలోకి తెచ్చిన ‘స్క్వేర్ ఫుట్ గార్డెనింగ్’ (www.squarefoot gardening.com) పద్ధతిని అవసరమైన మార్పులు చేసుకొని దత్తు దంపతులు అనుసరిస్తున్నారు. ఆయన అభిప్రాయాలు ఇవి..
మేడపై కూరగాయల మడులు అనగానే.. ఒకటో రెండో అనుకుంటాం. కానీ 13 మడులు ఏర్పాటు చేశారు. మేడ మెట్లెక్కితే.. కూరగాయల తోటలోకి అడుగుపెట్టినట్టు ఉంటుంది!
160 చదరపు అడుగుల విస్తీర్ణంలో మడులు పెట్టుకుంటే ఇద్దరు పిల్లలు, ఇద్దరు పెద్దలకు పూర్తిగా కూరగాయలు, ఆకుకూరలు పుష్కలంగా సరిపోతాయి.
టమాటా, వంగ, బెండ, క్యారట్, గోరుచిక్కుడు, గోంగూర సహా అన్ని ఆకుకూరలు, కొత్తిమీరతో పాటు.. కంది మొక్కలు కూడా పెంచుతున్నారు. కంది కాయల్లో గింజలు గట్టిపడిన తర్వాత కోసి చిక్కుడు మాదిరిగా కూర వండుకుంటున్నారు.
ఆరు అంగుళాల కంపోస్టు మడిలోనే కంది మొక్కలు పది అడుగుల ఎత్తు పెరిగి మంచి దిగుబడి ఇస్తున్నాయి.
ఇవి ప్రతి ఏటా తీసేయాల్సిన వంగడం కాదు. ఇక్రిశాట్ తయారుచేసిన ప్రత్యేక రకం. సీజన్ రాగానే పూత వచ్చి కాపు కాస్తుంది.
4 అడుగుల వెడల్పు, 4 అడుగుల పొడవు ఉండే ఇటుకల మడుల్లో అనేక రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. పాలిథిన్ షీట్ పరచి.. చుట్టూ రెండు వరుసల ఇటుకలు పేర్చి.. 80 కిలోల కంపోస్టు పోసి కూరగాయలు సాగుచేస్తున్నారు. కంపోస్టుకు కొంత వర్మిక్యులైట్ తప్ప మరేమీ కలపడం లేదు.
మేడపై మడుల్లో మట్టిని అసలు వాడకూడదు. మట్టి నీటిని పట్టి ఉంచుతుంది. దాని వల్ల మేడ శ్లాబ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది.
కంపోస్టు నీటిని పట్టి ఉంచదు. మనం నీరు పోసినప్పుడు ఎక్కువైన నీటిని కిందకు వదిలేస్తుంది. కంపోస్టు బరువు తక్కువ. వేళ్లకు ప్రాణవాయువు బాగా అందుతుంది. కాబట్టి చెట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
కుండపోత వానలు కురిసినా కంపోస్టు మడిలో నుంచి కొట్టుకుపోదు. పడిన నీరు కిందికి వెళ్లిపోతుంది.
పాత టైర్లను కూడా తగిన విధంగా అమర్చి మొక్కలు పెంచుతున్నారు.
అన్ని మడుల్లోనూ ఒకేసారి కాకుండా.. వరుస క్రమంలో పంటలు పండిస్తున్నారు. ఏడాది పొడవునా కూరగాయలకు లోటుండడం లేదు. పదేళ్లుగా కూరగాయలు కొనాల్సిన అవసరం రాలేదు.
వరిని ప్రయోగాత్మకంగా పండించారు. చక్కటి దిగుబడి వచ్చింది. వరిలోనూ నీరు నిల్వచేయనక్కర్లేదు. మడి తడీపొడిగా ఉంటేచాలు.
మాటిమాటికీ నేల తిరగబెట్టాల్సిన అవసరమూ ఉండదు. ఫోర్క్, పలుగు, పార వంటి పరికరాలతో పని లేదు. చీడ పీడలకు అవకాశం ఉండదు. కాబట్టి ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడేపనీ లేదు.
కంపోస్టు వేరు. వర్మి కంపోస్టు వేరు. వర్మి కంపోస్టులో కొంత మట్టి కలిపితేనే మొక్క బతుకుతుంది. నేల మీద వర్మి కంపోస్టుతో మొక్కలు పెంచవచ్చు.
కంపోస్టును కూరగాయల వ్యర్థాలు, ఆవుపేడ నీళ్లు, బూడిద.. తదితరాలు వాడి నేలపై 90 రోజుల్లో తయారుచేయవచ్చు. ఇళ్ల దగ్గరయితే.. రోజూ తిరగేస్తూ.. నెల రోజుల్లో కూడా కంపోస్టు తయారుచేయవచ్చు.
కంపోస్టులో కొత్తిమీర మొక్కలున్న మట్టి పాత్రను అతిథులకు బహూకరిస్తూ.. ఇంట్లోనే పండించుకోవడాన్ని అలవాటు చేస్తున్నారు.
సూక్ష్మ పోషకాలు కూడా పుష్కలంగా ఉండే సేంద్రియ కూరగాయలను ఇంటిపట్టున పండించుకోవాలంటే... బలమైన పూనిక ఉండాలి.
సేంద్రియ కూరగాయలు ప్రాణావసరంగా గ్రహించి.. పూనుకోవాలి. పూనిక ఉంటే.. ఆటంకాలను అధిగమించడం సమస్యే కాదు!
- న్యూస్‌లైన్, విజయవాడ (సీతారామపురం)
సందేహాలున్నాయా..?
విజయవాడ నడిబొడ్డున మేడపైనే అనేక సంవత్సరాలుగా కూరగాయలు పెంచుతున్న చలసాని దత్తును 0866- 2473246, 94414 73246 నంబర్లలో సంప్రదించవచ్చు. ఉదయం 8 నుంచి 12 గంటల వరకూ, సాయంత్రం 3 నుంచి 5 గంటల మధ్య ఆయనకు ఫోన్ చేయొచ్చు.
విత్తనాలను ఆవు పంచకంలో నానబెడితే మంచిది...!
ఏ గింజనైనా ఎక్కువ లోతులో పెట్టకూడదు. గింజ పరిమాణానికి ఒకటిన్నర పరిమాణం లోతులో నాటితే చాలు. అప్పుడే మొలకొస్తుంది. గో పంచకంలో ఒక రోజు నానబెట్టి, తర్వాత నీడలో ఆరబెట్టి.. నాటినా మంచిదే. అలాగని ఆరుబయట ఎండబెట్టకూడదు.
ఒక్క మొక్క చాలు..
చదరపు అడుగు స్థలంలో లేదా కుండీలో ఒక్క గింజ / మొక్క నాటితే చాలు. రెండు మూడు నాటాల్సిన అవసరం లేదు. రెండు, మూడు మొక్కలు మొలిచినా... అక్కడ ఒక్కదాన్నే ఉంచి.. మిగిలిన వాటిని మరో చోటికి మారిస్తే.. అన్ని మొక్కలూ ఏపుగా పెరుగుతాయి.
No comments:
Post a Comment